‘సమ్మోహనం’ ట్రైలర్‌ విడుదల
Spread the love

హైదరాబాద్‌: సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సమ్మోహనం’. బాలీవుడ్‌ నటి అదితి రావ్‌ హైదరి కథానాయికగా నటిస్తున్నారు. ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర ట్రైలర్‌ను ఆయన చేతుల మీదుగా విడుదల చేశారు.

‘అసలేముందిలా ఈ స్టార్లల్లో. నటన అబద్ధం, గ్లామర్‌ అబద్ధం, మాటలు అబద్ధం. అయినా ఎగబడతారేంట్రా?’ అంటూ సుధీర్‌బాబు డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. ‘స్టార్ట్‌ కెమెరా..రోలింగ్‌..యాక్షన్‌’ అంటూ ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ అతిథి పాత్రలో కన్పించారు. ‘స్టార్లు మామూలు మనుషులు కారు. వాళ్లను చూడ్డానికి మనం డబ్బులిచ్చి థియేటర్‌కు వెళుతున్నామంటే మనలో లేనిది వారిలో ఏదో ఉంది’ అంటూ ఓ హాస్యనటుడు.. సుధీర్‌తో చెప్తూ కన్పించారు. సుధీర్ బాబుకు బొమ్మలువేయడం అంటే ఇష్టం. ‘నా ఆర్ట్‌ చిన్న పిల్లలకు ఆనందాన్నిస్తుంది నాన్నా. వాళ్ల ఇమాజినేషన్‌ను పెంచుతుంది. సినిమాలు..ఆ ప్రపంచమే నరకం నాన్నా’ అని సుధీర్‌బాబు నరేశ్‌తో చెప్తున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఇందులో అదితి రీల్‌ లైఫ్‌లోనూ హీరోయిన్‌గా నటించారు. ‘తెలుగు రానప్పుడు తెలుగు సినిమాలు ఎందుకు చేయాలి?’ అని సుధీర్‌బాబు అదితిని కామెంట్‌ చేయడం ఫన్నీగా ఉంది.

అదితి, సుధీర్‌ ప్రేమించుకోవడం ఆ తర్వాత ఇద్దరూ విడిపోవడంతో ‘సినిమావాళ్ల మీద నాకున్న అభిప్రాయం తప్పనుకున్నా నిన్ను కలిసిన తర్వాత. కాదని చెంప పగలగొట్టి మరీ నిరూపించావ్‌. మనుషుల్ని వాడుకోవడం మీ ప్రొఫెషన్‌లో చాలా సాధారణం అనుకుంటా’ అని సుధీర్‌ అంటారు. ట్రైలర్‌ను బట్టి చూస్తే సినిమాలోనే మరో సినిమా ప్రపంచాన్ని చూపించబోతున్నట్లు అనిపిస్తోంది. వివేక్‌ సాగర్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్‌ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.