‘సమ్మోహనం’ మూవీ రివ్యూ
Spread the love

చిత్రం: సమ్మోహనం

నటీనటులు: సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, న‌రేశ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పవిత్రా లోకేష్ ,హర్షిణి, నందు, కాదంబ‌రి కిర‌ణ్‌, హ‌రితేజ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, కేదార్ శంక‌ర్‌, శిశిర్‌శ‌ర్మ త‌దిత‌రులు

ఛాయాగ్ర‌హ‌ణం: పి.జి.విందా

సంగీతం: వివేక్ సాగ‌ర్‌

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: య‌స్‌. ర‌వీంద‌ర్‌

కూర్పు: మార్తాండ్‌.కె.వెంక‌టేశ్‌

పాట‌లు: ‘సిరివెన్నెల‌’ సీతారామ‌శాస్త్రి, రామ‌జోగయ్య‌శాస్త్రి

నిర్మాత‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌

ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి

సంస్థ‌: శ్రీదేవి మూవీస్

స్వ‌చ్ఛ‌మైన వినోదంతో తెలుగుద‌నానికి పెద్ద‌పీట వేస్తూ సినిమాలు తీసే ద‌ర్శకుడు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి. ఆయ‌న సినిమాలు ఇంటిల్లిపాదీ క‌లిసి చూసేలా ఉంటాయి. ఒకొక్కసారి ఒక్కో ర‌క‌మైన నేప‌థ్యంతో తీయ‌డం ఆయ‌న శైలి. దాంతో మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి సినిమా అన‌గానే ఏదో ఒక కొత్త‌ద‌నం ఉంటుంద‌నే న‌మ్మ‌కంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్లకొస్తుంటారు. ఈ సారి సమ్మోహన పరిచే ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుధీర్‌ బాబు హీరోగా అదితిరావు హైదరీని హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన సమ్మోహనం నిజంగానే సమ్మోహన పరిచిందా..? మోహనకృష్ణ మరోసారి తన మ్యాజిక్‌ను రిపీట్ చేశారా..? లవర్‌ బాయ్‌గా సుధీర్ బాబు ఏ మేరకు ఆకట్టుకున్నాడు..?

కథ:

ఆర్‌.విజ‌య్‌కుమార్ (సుధీర్‌బాబు) ఓ చిత్రకారుడు. చిల్డ్ర‌న్ బుక్ ఇల‌స్ట్రేట‌ర్‌గా త‌న ప్ర‌తిభ‌ని నిరూపించుకొనే ప్ర‌య‌త్నంలో ఉంటాడు. త‌న క‌ళ పిల్ల‌ల ఊహాశ‌క్తిని పెంచుతుంద‌ని న‌మ్ముతుంటాడు. సినిమాలంటే ఇష్టం ఉండదు. కానీ, ఆయ‌న తండ్రి (న‌రేష్‌)కి మాత్రం సినిమాలంటే పిచ్చి ప్రేమ‌. ఎప్ప‌టికైనా త‌న‌ని తాను తెర‌పై చూసుకోవాల‌ని త‌ప‌న ప‌డుతుంటాడు. సినిమాలోని తెలుగు సంభాష‌ణ‌ల్ని విజ‌య్‌ ద్వారా నేర్చుకుంటుంది స‌మీర‌. ఈ క్ర‌మంలోనే విజ‌య్.. స‌మీర ప్రేమ‌లో ప‌డ‌తాడు. మ‌నాలీలో చిత్రీక‌ర‌ణ‌లో ఉన్న స‌మీర ద‌గ్గ‌రికి వెళ్లి త‌న ప్రేమ విష‌యాన్ని చెబుతాడు. మ‌రి స్టార్ క‌థానాయిక‌గా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వెలుగుతున్న సమీర… ఒక సామాన్య‌ యువ‌కుడైన విజయ్‌ని ప్రేమించిందా? క‌థానాయిక‌గా బ‌య‌టికి అందంగా క‌నిపించే స‌మీర జీవితం వెన‌క ఎలాంటి క‌ష్టాలుంటాయి? త‌దిత‌ర విష‌యాల‌తో మిగ‌తా సినిమా సాగుతుంది.

విశ్లేషణ ;

ఒక అగ్ర క‌థానాయిక‌కీ సినిమా ప్ర‌పంచం భ‌యంక‌ర‌మైన‌ద‌ని భావించే ఓ సామాన్యమైన యువ‌కుడికీ మ‌ధ్య ప్రేమ నేప‌థ్యంలో సాగే క‌థే ఈ చిత్రం. క‌థానాయిక‌లు కూడా మ‌నుషులే, వాళ్లూ సామాన్య‌మైన జీవితాన్ని గ‌డ‌పడానికి ఇష్ట‌ప‌డ‌తార‌నే విష‌యంతో పాటు. బ‌య‌ట మాట్లాడుకొనేంత చెత్తగా సినిమా ప‌రిశ్ర‌మ ఉండ‌ద‌నే ఓ సందేశాన్నిస్తుందీ చిత్రం. సినిమానే క‌ల‌గా భావిస్తూ కెరీర్‌ని మ‌ల‌చుకొనే స‌గ‌టు క‌థానాయిక జీవితం వెన‌క సంఘ‌ర్ష‌ణ‌ కూడా ఇందులో ప్ర‌తిబింబిస్తుంది. ప్రేమకథ మొదలైన తరువాత కథనంలో కాస్త వేగం తగ్గింది.

ఆరంభంలో చాలా సాధారణంగా నడిచే ‘సమ్మోహనం’ కథానాయిక రాకతోనే ఊపందుకుంటుంది. ఆమె పాత్ర ఆరంభం నుంచి ఆసక్తి రేకెత్తిస్తుంది. సినిమా షూటింగ్ నేపథ్యంలో మంచి సీన్స్ రాసుకున్నాడు ఇంద్రగంటి. హీరో హీరోయిన్ల పరిచయం.. వాళ్ల మధ్య బంధం ఏర్పడే క్రమంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. చాలా తక్కువ సన్నివేశాలతోనే లవ్ స్టోరీని రక్తి కట్టించగలిగాడు. ఈ క్రమంలో వచ్చే టెర్రస్ సీన్ ఇంద్రగంటి స్థాయిని తెలియజేస్తుంది. చాలా పరిణతితో.. ఆహ్లాదంగా సాగే ఈ సన్నివేశం సినిమాలో స్టాండ్ ఔట్ గా నిలుస్తుంది. ఇక్కడ రచయితగా కూడా ఇంద్రగంటి తన ప్రతిభను చాటుకున్నాడు. ఐతే విరామం తర్వాత ‘సమ్మోహనం’ కొంచెం ట్రాక్ తప్పుతుంది. సాధారణంగా.. నెమ్మదిగా సాగే సన్నివేశాలు కొంత వరకు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి.

తొలి స‌గ‌భాగం సినిమా అంతా కూడా విజ‌య్ ఇంట్లో 20 రోజులు షూటింగ్ సంద‌డి… స‌మీర‌తో ప్రేమలో ప‌డే స‌న్నివేశాల‌తోనే సాగుతుంది. మ‌లి భాగంలో కాస్త డ్రామాని జోడించారు. క‌థానాయిక స‌మీర జీవితం వెన‌క ఉన్న సంఘ‌ట‌న‌ల్ని చూపించారు. అవ‌న్నీ సహజంగా న‌టుల జీవితాల్ని క‌ళ్ల‌కు క‌డుతున్న‌ట్టుగా అనిపిస్తాయి. చిన్న క‌థ‌తోనే మంచి సంభాష‌ణ‌లు, మంచి దృశ్యాల‌తో అందంగా చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. స‌గ‌టు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాలు వాస్తవికతకు అద్దం ప‌ట్టేలా ఉన్న‌ప్ప‌టికీ… వాటిపైన వ్యంగ్యాస్త్రాలు సంధించిన‌ట్టు అనిపిస్తాయి. ప‌తాక స‌న్నివేశాల్లో న‌రేష్ చేసే హంగామా బాగుంది. కానీ, బుక్ ఆవిష్క‌ర‌ణ నేప‌థ్యంలో చెప్పే క‌థ‌లు కాస్త సాగ‌దీత‌గా అనిపిస్తాయి. అయినా, ఆ ముగింపునకు అది అవసరమే. అక్కడక్కడా నిదానంగా సాగే సన్నివేశాలను మినహాయిస్తే, కుటుంబ సమేతంగా వెళ్లి చూసే మరొక మంచి చిత్రం ‘సమ్మోహనం’.

నటీనటులు:

సుధీర్‌బాబు న‌ట‌న చాలా బాగుంది. ఒక మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన యువ‌కుడిగా ఆయ‌న అభినయం ఆక‌ట్టుకుంటుంది. ప్రేమ నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాల్లోనూ, భావోద్వేగాల ప‌రంగానూ ఆయ‌నలోని ప‌రిణ‌తి స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. స‌మీర రాథోడ్‌గా అదితి హైద‌రీ ఆక‌ట్టుకుంటుంది. హీరో తండ్రి పాత్రలో సీనియర్‌ నరేష్‌ సినిమాకు ప్లస్ అయ్యారు. కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. హీరో తల్లి పాత్రలో పవిత్రా లోకేష్‌ హుందాగా కనిపించారు. ముఖ్యంగా సుధీర్‌ బాబు, పవిత్రా లోకేష్ మధ్య వచ్చే సన్నివేశాలు మనసుకు హత్తుకుంటాయి. హీరో ఫ్రెండ్స్‌గా రాహుల్‌ రామకృష్ణ, అభయ్‌ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇతర పాత్రలో తనికెళ్ల భరణి, హరితేజ, నందు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం:

‘సమ్మోహనం’కు సాంకేతిక నిపుణులు కూడా బలంగా నిలిచారు. ‘పెళ్ళిచూపులు’ ఫేమ్ వివేక్ సాగర్ మరోసారి ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాను నడిపించడంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలు తక్కువే కానీ.. సినిమాకు అవి సరిపోయాయి. మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌కుడిగా, ర‌చ‌యితగా మంచి ప‌నితీరును క‌న‌బ‌రిచారు. స్వ‌చ్ఛ‌మైన వినోదంతో చిత్రాన్ని తీర్చిదిద్దారు. శ్రీదేవి మూవీస్ స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉన్న‌త‌మైన నిర్మాణ విలువ‌లు తెర‌పై స్ప‌ష్టంగా క‌నిపిస్తాయి.

బ‌లాలు

క‌థా నేప‌థ్యం

నాయ‌కానాయిక‌లు

బ‌ల‌హీన‌త‌లు

నిదానంగా సాగే కొన్ని స‌న్నివేశాలు

చివ‌రిగా..: ‘స‌మ్‌’మోహ‌నంగా సాగే చిత్రం

రేటింగ్: 3/5