పంజా సమయంలో చచ్చిపోవాలకున్నా: పవన్ కళ్యాణ్
Spread the love

సినిమాలు వదిలేసి రాజకీయాల బాట పట్టిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతగా ఇటీవల జరిగిన స్టూడెంట్ మీట్లో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. మీ జీవితంలోని చేదు అనుభవాల గురించి చెప్పండి అని ఓ విద్యార్థిని అడగ్గా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ తాను చిన్న తనంలో ఓసారి జీవితం మీద విరిక్తి పుట్టి పిస్టల్‌తో కాల్చుకుని చనిపోవాలనుకున్నానని, అపుడు ఇంట్లో వాళ్లు విషయం గుర్తించి తనను ఆ పరిస్థితి నుండి బయట పడేశారు. తర్వాత ‘పంజా’ సినిమా సమయంలో అలాంటి పరిస్థితే ఎదురైంది అంటూ అందుకు గల కారణాలు వివరించే ప్రయత్నం చేశారు.

చిన్నతనంలో నాకు బాగా చదుకోవాలనే కోరిక ఉండేది. కానీ పియూసీ రాయలేక ఇంటికి వచ్చేసిన తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. మా ఫ్రెండ్స్ అందరూ నాకంటే చదువులో ముందుకు వెళ్లారు. నేనేమో అలాగే ఉండిపోయాను. టీనేజ్‌లో మన ఫ్రెండ్స్ ఆరు నెలలు ముందుకెళ్లినా మనకు చాలా వెనకబడిపోయామనే ఫీలింగ్ కలుగుతుంది. అదే ఫీలింగుతో డిప్రెషన్లోకి వెళ్లి చనిపోవాలనుకున్నాను.అపుడు నేనొక మొద్దు విద్యార్థిని. నాకు అర్థమయ్యే విధంగా చెప్పే టీచర్ దొరకక పోవడం కూడా నన్ను మరింత కృంగదీసింది. చదువులో వెనకపబడిపోయాను, నా వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం లేదు అనే ఫీలింగ్ వచ్చేసింది.

మా ఇంట్లో అపుడు పిస్టల్ ఉండేది. దాంతో కాల్చుకుని చనిపోవాలనుకుని లోడ్ చేసి పెట్టుకున్నాను. దానికంటే ముందు ఇంట్లో వారితో అనుకోకుండా నేను మీకు రెండు గంటలకంటే ఎక్కువ సేపు కనిపించను అని ఓ మాట అన్నాను. దాంతో వారికి అనుమానం వచ్చి వెతకడంతో నా వద్ద నుండి తుపాకి లాక్కుని క్లాస్ పీకారు. ఆ తర్వాత ఆ పరిస్థితి నుండి బయట పడ్డాను.చిన్న తనంలో ఏర్పడిన పరిస్థితి మళ్లీ ‘పంజా’ సమయంలో ఎదురైంది. తమిళనాడులో షూటింగ్ జరుగుతున్న సమయంలో 17 ఏళ్ల వయసులో ఏలాగైతా చనిపోవాలనే ఆలోచన వచ్చిందో మరోసారి అలాంటి ఆలోచనలు వచ్చాయి. అయితే ఈ సారి నాకు నేనుగా ఆ పరిస్థితి నుండి అధిగమించాను.

విలువలతో జీవిస్తే జీవితంలో అన్నీ ఎదురు దెబ్బలే తగిలాయి. కొన్ని సార్లు ఎందుకు ఈ జీవితం అనే ఆలోచన వచ్చింది. ఇలా నిరాశ నిస్పృహలకు గురైన ప్రతిసారి ఆ పరిస్థితి నుండి బయటపడే ప్రయత్నం చేశాను. అలాంటి పరిస్థితుల నుండి బయటపడి ముందుకు సాగడమే జీవితం అని అర్థం చేసుకున్నాను.

ఇంట్లో అందరికంటే చిన్నవాడిని అవ్వడం వల్లనో ఏమో నన్ను ఎవరూ నమ్మే వారు కాదు. వీడు తెలియ ఇలానే మాట్లాడతాడు అనుకునే వారు. చాలా కాలం మా ఇంట్లో వారికి నాకు ఇంగ్లీష్ వచ్చనే విషయం కూడా తెలియదు.నేను జీవితంలో చేసిన ఏ పనులకు బాధపడలేదు. అన్నీ పనులు తెలిసే చేశాను. ఒక నిర్ణయం తీసుకునే సమయంలో అన్నీ ఆలోచిస్తాను. తప్పక కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను. దీని వల్ల కాన్‌సీక్వెన్సెస్ ఉంటాయి, దెబ్బలు తింటాను అని తెలిసే కొన్ని కారణాల వల్ల ఆ నిర్ణాయలు తీసుకున్నాను. కానీ ఎప్పుడూ ఈ నిర్ణయం తీసుకుని ఉండకూడదే అని ఎప్పుడూ అనుకోలేదు అని పవన్ కళ్యాణ్ తెలిపారు.