
చిత్రం: ‘ పడి పడి లేచే మనసు‘
బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
నటీనటులు: శర్వానంద్, సాయి పల్లవి, మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ప్రియ రామన్, అభిషేక్ మహర్షి తదితరులు
జోనర్: రొమాంటిక్ ఎంటర్టైనర్
దర్శకుడు: హను రాఘవపూడి
నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
కెమెరా : జయకృష్ణ గుమ్మడి
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
కొరియోగ్రఫీ: రాజు సుందరం
సాహిత్యం: కృష్ణ కాంత్
మంచి కథా బలమున్న పాత్రలను అవలీలగా చేయగలడన్న పేరుంది శర్వానంద్‌కి. సరైన పాత్ర పడాలేగానీ, ముఖ కవళికలతోనూ, చలాకీతనంతోనూ మెప్పించగలదనే పేరు తెచ్చుకుని ప్రేక్షకులను ఫిదా చేసిన ఘనత సాయిపల్లవిది. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న మరొక ప్రేమకథే ‘పడి పడి లేచె మనసు’. సాయిపల్లవి కూడా తోడవడంతో సినిమా విడుదలకి ముందే అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రచార చిత్రాలతో మరిన్ని అంచనాలు పెంచేసింది. మరి అసలు చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం పదండి…
కథ:
సూర్య రావిపాటి (శర్వానంద్) ఫుట్‌బాల్ ప్లేయర్. అతనికి డాక్టర్ వైశాలి (సాయిపల్లవి) అంటే చాలా ఇష్టం. వైశాలి తండ్రి మేజిస్ట్రేట్. వీళ్లందరూ కోల్‌కతాలో ఉన్న తెలుగువాళ్లు వైశాలికి సూర్య అంటే ఇష్టం పెరుగుతుంది. సూర్య ప్రేమలో నిజాయతీని గమనించిన వైశాలి కూడా అతన్ని ప్రేమిస్తుంది. ఇంతలో వైశాలి మెడికల్ క్యాంప్ కోసమని నేపాల్ వెళుతుంది. ఆమెను వెతుక్కుంటూ వెళతాడు సూర్య. వైశాలి పెళ్లి ప్రస్తావన తెస్తుంది. పెళ్లి అంటే రాజీపడి బతకడమని… పెళ్లి కాకుండా ప్రేమలో మాత్రమే సంతోషంగా ఉంటామని సూర్య చెబుతాడు. కలిసుండకపోతే చచ్చిపోతామనుకున్నప్పుడే పెళ్లి చేసుకోవాలని, ఏడాది తర్వాత కూడా ఇద్దరికీ అలా అనిపించినప్పుడు, ఇక్కడే పెళ్లి చేసుకుందామని చెబుతాడు. సూర్య అలా చెప్పడానికి కారణమేమిటి? అప్పుడు విడిపోయిన ఆ ఇద్దరూ మళ్లీ కలిశారా? వైశాలి కోసం ఏడాది తర్వాత నేపాల్ వెళ్లిన సూర్యకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
రెండేళ్లు ఒకమ్మాయి వెనుక తిరిగి, ఆమె ఇష్టాయిష్టాలను తెలుసుకుని, ఆమె మనసుకు దగ్గర కావడం మామూలు విషయం కాదు. ఆ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ప్రేమలో అరమరికలు ఉండవు. ప్రేమించిన వారి మధ్య అబద్ధాలుండవు అనే విషయాన్ని కూడా అంతర్లీనంగా చెప్పారు. కోల్‌కతా నేపథ్యం, కొన్ని లొకేషన్లు, కాన్ ఫ్లిక్ట్.. అంతా బాగానే ఉంది. అందులో కొత్తదనం కనిపించినా… చాలా సన్నివేశాలు సామాన్య ప్రేక్షకుడికి అర్థం కాని, అందుకోలేని విధంగా అనిపిస్తాయి. తొలి సగభాగం సూర్య, వైశాలి మధ్య ప్రేమ సన్నివేశాలతో సాగుతుంది. కోల్‌కతా నేపథ్యం కొత్త అనుభూతిని పంచుతుంది. భయంగా ఉన్నట్లు నటిస్తూ ప్రేమించడం అనే కాన్సెప్ట్ కొత్తగానే ఉన్నప్పటికీ… దాని చుట్టూ అల్లిన సన్నివేశాల్లో మాత్రం కొత్తదనం కనిపించలేదు. హాస్యం కోసం చేసిన ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలించలేదు. విరామానికి ముందు నేపాల్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు మాత్రం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ద్వితీయార్ధంలో ప్రేమజంట మరోసారి ప్రేమించుకోవాల్సి రావడంతో… తొలిభాగంలోని సన్నివేశాల్నే మరోసారి తెరపై చూస్తున్నట్టు అనిపిస్తుంది. హాస్యం కోసం చేసిన ప్రయత్నాలూ ఆకట్టుకోలేదు. మెమొరీ లాస్ చుట్టూ అల్లిన డ్రామా కథకి కీలకం.
ప్లస్ పాయింట్లు:
శర్వానంద్, సాయిపల్లవి నటన
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
పాటలు
ఛాయాగ్రహణం
విరామానికి ముందు సన్నివేశాలు
మైనస్ పాయింట్లు:
సెకండ్ హాఫ్‌లో బోరింగ్ సీన్స్
ఎక్కువ సాగదీతగా అనిపించింది
అతకని బ్రేకప్ సన్నివేశాలు
రేటింగ్:3.0