ఇక పై ఆధార్‌ అడిగితే రూ.1 కోటి జరిమానా… జైలుశిక్ష
Spread the love

మనం ఏ పని చేయాల్సివచ్చిన ఆధార్ తప్పనిసరిగా అడుగుతున్నారు. ఇప్పుడు అంతా ఆధార్ మయం.. సంక్షేమ పథకాలతో పాటు ప్రతీ దానికి ఆధార్ తప్పనిసరి. టెలికాం కంపెనీలతో పాటు బ్యాంకులు సైతం ఆధార్ కార్డ్ లేకపోతే మీ పని అవ్వదంటూ కస్టమర్లను ఇబ్బందులు పెట్టాయి. కానీ ఇక నుంచి అలా వినియోగదారులపై ఒత్తిడి చేయడం లాంటివి ఉండవు. బ్యాంకు ఖాతా తెరిచేందుకు, మొబైల్ సిమ్ కార్డు ఇచ్చేందుకు అడ్రస్ ప్రూఫ్, గుర్తింపు వివరాల కోసం ఆధార్ కార్డ్ అడిగితే ఆయా సంస్థలు రూ.1 కోటి రూపాయల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుందని,ఆధార్ అడిగిన సంబంధిత ఉద్యోగికి మూడు నుంచి పదేళ్లవరకు జైలుశిక్ష పడనుంది.

ఆధార్‌ ద్వారా ధ్రువీకరణకు సమాచారం తీసుకునేటప్పుడు సంబంధిత వ్యక్తుల సమ్మతి పొందకపోతే రూ.10,000 జరిమానా, మూడేళ్ల జైలుశిక్ష విధిస్తారు. ఆధార్‌ గుర్తింపును, లేదా ఫోటోను అనధికారికంగా ప్రచురిస్తే రూ.10,000 నుంచి రూ.లక్ష వరకు జరిమానా పడుతుంది. ఈ మేరకు త్వరలో పార్లమెంటులో చట్టం చేయడానికి కేంద్ర మంత్రిమండలి ఇటీవల ఆమోదం తెలిపింది. కేవైసీ ఫార్మాలిటీస్ కోసం వినియోగదారుడిని కేవలం ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డు అడగాలని సూచించారు. గతంలో చెప్పినట్లుగానే కేవలం ప్రభుత్వ నిధులతో అందించే సంక్షేమ పథకాలకు మాత్రమే ఆధార్ కార్డ్ తప్పనిసరి చేయవచ్చునని సుప్రీంకోర్ట్ గతంలోనే పేర్కొంది. ఆధార్ కార్డు ఇస్తే పౌరుల వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా పోతుందని సుప్రీం అభిప్రాయపడింది.