రాజమహేంద్రవరంలో ఉప్పొంగిన జనగోదావరి
Spread the love

నాలుగున్నర కిలోమీటర్ల దూరమున్న గోదారమ్మ ఆ గట్టునూ, ఈ గట్టునూ కలిపేసిన మహాజనవారధి. ఆ దృశ్యం నభూతో. శతాబ్దాల చరిత్రగల రాజమహేంద్రవరమే కనీవినీ ఎరుగని ఆ దృశ్యాన్ని సంభ్రమాశ్చర్యాలతో తిలకించింది. అవ్వలు–తాతలు, అక్కలు–చెల్లెళ్లు, అన్నలు–తమ్ముళ్లు.. సహస్ర వృత్తుల సకలజన శ్రేణులు ఒక సంకల్ప దీక్షతో చేసిన చరిత్రాత్మక కవాతుకు బృహత్‌ గోదావరి సంఘీభావ సంతకం చేసింది. రాజమహేంద్రవరం ఎదురేగి స్వాగతం పలికి అక్కున చేర్చుకున్నది. వీరతిలకం దిద్ది విజయీభవ నినాదం చేసింది. అలుపెరుగని ప్రజా ఉద్యమాలతో తెలుగునేలపై సాటిలేని జననేతగా రూపుదిద్దుకున్న   వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర మంగళవారం నాడు ఒక కొత్త చరిత్రను లిఖించింది.

జన వారధి కట్టినట్టు.. జన ఉప్పెన వచ్చినట్టు.. రాజమహేంద్రవరం పోటెత్తింది. ఇసుకేస్తే రాలనంతగా జన జాతరను తలపించింది. అశేష జనవాహిని జననేతకు బ్రహ్మరథం పట్టింది. పశ్చిమ సరిహద్దున ఘనంగా వీడ్కోలు పలకగా.. నేతలు, కార్యకర్తలు, అభిమానులు తూర్పున ఘన స్వాగతం పలికారు. గోదావరమ్మకు పూజలు నిర్వహించి.. హారతి ఇచ్చి, రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జిపై జననేత ముందుకు సాగారు. అసంఖ్యాక అభిమాన జనం ఆయన వెనుక అడుగులో అడుగేశారు. నాలుగు కిలోమీటర్లకు పైగా కనుచూపు మేర కొవ్వూరు బ్రిడ్జి మొదలు కోటిపల్లి బస్టాండ్‌ వరకు జనమే జనం. పార్టీ జెండాలతో ఉన్న 600 పడవలు నదిలో అభిమాన నేతకు స్వాగతం పలుకుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాజమహేంద్రవరంలో జననేత అడుగు పెట్టగానే పెద్ద సంఖ్యలో మహిళలు, యువత.. జై జగన్‌ అని నినాదాలు చేస్తూ.. పూల వర్షం కురిపిస్తూ స్వాగతించారు. రంగవల్లులతో ఆత్మీయ స్వాగతం పలికారు. నాటి వైఎస్సార్‌ ప్రజా ప్రస్థానం పాదయాత్రను జనం గుర్తు చేసుకుంటూ.. మహానేతపై చూపించిన అభిమానానికి రెట్టింపుగా ఆయన తనయుడు జగన్‌కు నీరాజనాలు పలికారు.

పశ్చిమలో ఘనంగా వీడ్కోలు   

చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో ముగించుకుని తూర్పు గోదావరి జిల్లాలో అడుగుపెట్టింది. మంగళవారం 187వ రోజు పాదయాత్ర ప్రారంభానికి ముందు వైఎస్‌ జగన్‌ కొవ్వూరు గోదావరి గట్టు సమీపంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం గోష్పాద క్షేత్రానికి ఉదయం 8.45 గంటలకు చేరుకున్నారు. ఆలయ సంప్రదాయం మేరకు వేద పండితుల ఆధ్వర్యంలో ఆయన గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గోదారమ్మ తల్లికి హారతి ఇచ్చారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. వేద పండితుల ఆశీర్వాదం అనంతరం పాదయాత్ర కొనసాగిస్తూ ముందుకు సాగారు.

తూర్పున బ్రహ్మరథం.. 

నేల ఈనిందా.. ఆకాశానికి చిల్లు పడిందా.. చుక్కలు నేలను తాకాయా అన్నట్టుగా రాజమహేంద్రవరం జన గోదారి అయ్యింది. నీటిలో పడవలు, బ్రిడ్జిపై జనాలు.. ఆకాశంలో బెలూన్లతో పలికిన స్వాగతం దివిని, భువిని కలుపుతూ నిర్మించిన జన వంతెనను తలపించింది. మధ్యాహ్నం నుంచే భారీ ఎత్తున జనం తరలివచ్చారు. ఉòప్పెనలా ఎగిసిపడ్డ జనాభిమానానికి జగన్‌ తన్మయత్వానికి గురయ్యారు.  కొవ్వూరు రోడ్డు కమ్‌ రైల్‌ బ్రిడ్జి నాలుగు కిలోమీటర్ల మేర వైఎస్సార్‌ పార్టీ జెండాలతో రెపరెపలాడింది. ప్యారాచూట్‌లతో కూడిన పార్టీ జెండాలు ఆకాశంలో కను విందు చేశాయి. 108 మంది మహిళలు కలశాలతో, 30 మంది బాలికలు వీణలతో, 150 మంది మహిళలు గుమ్మడి కాయలతో హారతి పడుతూ స్వాగతం పలికారు. డప్పులు, వాయిద్యాలు, గరగ నృత్యాలు, మహిళా తీన్‌మార్‌లు, యువకుల ర్యాలీ లు, నృత్యాలతో పండుగ వాతావరణం సంతరించుకుంది. కాగా కొవ్వూరు వైపు నుంచి పాదయాత్ర బ్రిడ్జిపైకి కొద్ది దూరం రాగానే బ్రిడ్జి ఊగింది. సస్పె న్షన్‌ బ్రిడ్జి కావడంతో సహజ సిద్ధంగానే ఊగింది. దీంతో బ్రిడ్జి ప్రారంభంలో ప్రజలు మరింతగా బ్రిడ్జిపైకి రాకుండా కొద్దిసేపు నిలువరించి వదిలారు. మధ్య మధ్యలో బ్రిడ్జి ఊగుతుండడంతో పోలీసులు నడిచే వారిని అక్కడక్కడ నిలువరించి పంపారు.