వాజ్‌పేయీకి ఎదురైన పరిస్థితే యడ్యూరప్పకూ ఎదురవుతుందా?
Spread the love

కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు బీజేపీ నేత యడ్యూరప్ప చాలా సతమతమవుతున్నాడు.ఇలాగే గతంలో ప్రధానిగా ప్రమాణం చేసి మెజారిటీ నిరూపించుకోలేక రాజీనామా చేసిన వాజ్‌పేయిని యడ్యూరప్ప మరిచిపోయారేమో. నాడు వాజ్‌పేయీ మాదిరిగా యడ్యూరప్ప కూడా బలాన్ని నిరూపించుకోలేక రాజీనామా చేస్తారా? పర్యవసానంగా కుమారస్వామి ముఖ్యమంత్రి అవుతారా? చరిత్ర పునరావృతమవుతుందా? లేదంటే విశ్వాస పరీక్షలో నెగ్గి పదవిలో కొనసాగుతారా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.

అప్పుడు: అది 1996.. స్థలం- దిల్లీ.. సంపూర్ణమైన ఆధిక్యం లేకపోయినా ప్రధానిగా భాజపా అగ్రనేత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రమాణ స్వీకారం… తగిన మద్దతు కూడగట్టలేక 13 రోజులకే రాజీనామా.. అతి తక్కువ సీట్లు ఉన్న దేవెగౌడ ప్రధానిగా ప్రమాణ స్వీకారం..

ఇప్పుడు: ఇది 2018.. స్థలం- బెంగళూరు.. పూర్తి మెజార్టీ లేకపోయినా కర్ణాటక ముఖ్యమంత్రిగా భాజపాకు చెందిన యడ్యూరప్ప బాధ్యతల స్వీకారం.. అసెంబ్లీలో బలపరీక్షకు ఇంకా 14 రోజుల సమయం.. తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన దేవెగౌడ కుమారుడు కుమారస్వామి…

మెజారిటీ నిరూపించుకోలేక వాజ్‌పేయి రాజీనామా!

కర్ణాటక అసెంబ్లీలో అతి పెద్ద పార్టీ బీజేపీ(104 సీట్లు) నేత బీఎస్‌ యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటుకు రాష్ట్ర గవర్నర్‌ ఆహ్వానించినట్టే 1996 లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ పక్ష నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయిని అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌ శర్మ ఆహ్వానించారు. పార్లమెంటు ఎన్నికల్లో 161 సీట్లతో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది.ఎన్నికల నాటి పాలకపక్షమైన కాంగ్రెస్‌ 140 స్థానాలకు పరిమితం కాగా, ఒకప్పటి (1989-90) పాలకపక్షం జనతాదళ్‌ 46 సీట్లు సాధించింది. ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీరాని పక్షంలో అతి పెద్దపక్షాన్నే ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలన్న పూర్వ రాష్ట్రపతి ఆర్‌.వెంకట్రామన్‌ నెలకొల్పిన సంప్రదాయాన్ని శర్మ అనుసరిస్తూ మెజారిటీ సభ్యుల మద్దతు లేకున్నా వాజ్‌పేయిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించి ఆయనతో ప్రధానిగా ప్రమాణం చేయించారు.

అయితే తగినంత బలంలేదని అప్పట్లో వాజ్‌పేయీకి కూడా తెలుసు. కానీ ప్రతిపక్ష ఎంపీల మద్దతు పొందవచ్చన్న ఆశతో పదవి చేపట్టారు. చివరకు అధి సాధ్యం కాలేదు. అదనంగా ఒక్కరు కూడా జతపడలేదు. పార్లమెంటులో గంటసేపు ప్రసంగించి నైతిక కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికలకు ముందు విభేదించిన పార్టీతోనే కాంగ్రెస్‌ జత కట్టిందని, భాజపాకు అనుకూలంగా ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాసిందని విమర్శించారు. దూరదర్శన్‌లో ప్రసారమైన ఆ ప్రసంగం చాలా ప్రభావం చూపింది. 1999 ఎన్నికల్లో విజయం సాధించడానికి కొంతవరకు దోహదపడింది. కేవలం 44 సీట్లు ఉన్నప్పటికీ జనతాదళ్‌కు చెందిన దేవెగౌడ యునైటెడ్‌ ఫ్రంట్‌ తరఫున ప్రధాని అయ్యారు. 136 సీట్లు ఉన్న కాంగ్రెస్‌ అండగా నిలిచింది. ప్రాంతీయ నాయకుడైన ఆయన ప్రధాని పదవి రేసులోనే లేరు. మిత్రపక్షాలు ఏకగ్రీవంగా ఆయన పేరును ప్రతిపాదించడం గమనార్హం. ఆ తరువాత కాంగ్రెస్‌ పార్టీయే మద్దతు ఉపసంహరించడం వేరే విషయం.

ఈ 22 ఏళ్లలో చాలా మార్పులు వచ్చాయి. అప్పటికి భాజపా ఇంకా శైశవదశలోనే ఉంది. అధికారం చేపట్టడం అదే ప్రథమం. ఇప్పుడు అంగ, ఆర్థిక, వ్యవస్థాగత బలం ఉంది. కేంద్రంలోనూ, మెజార్టీ రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉంది. నాటి అనుభవాలతో కొత్త వ్యూహాన్ని అమలు చేస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలను తిప్పుకోవచ్చన్న ఆశతోనే ప్రస్తుతం యడ్యూరప్ప కూడా పదవి చేపట్టారు. కాంగ్రెస్‌- జేడీ(ఎస్‌) పొత్తు ‘అపవిత్రమైనద’ని ఇప్పటికే విమర్శలు సంధించారు. చట్టవ్యతిరేకమని తెలిసినా విపక్ష ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడం మినహా మరో మార్గం లేదు. కొందరు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించడమో, లేదా సభకు రాకుండా గైర్హాజరు అయ్యేలా చూడడమో ద్వారా విశ్వాస పరీక్ష నెగ్గే అవకాశం ఉంది. అలా చేస్తే ఆ ఎమ్మెల్యేలు ఫిరాయింపుల చట్టం కింద అనర్హులవుతారు? ఎన్నికలు జరిగిన కొద్ది రోజుల్లోనే ఎవరైనా ఆత్మహత్యా సదృశంలాంటి ఇంతటి రిస్కును తీసుకుంటారా? అన్న సందేహాలు ఉన్నాయి.

ఒకవేళ కొత్త ఎమ్మెల్యేలు అంత సాహసం చేయాలంటే ‘కాదనలేని ప్రలోభాల’ను ఎరవేయాల్సి ఉంటుంది. అది జరిగితే సభ విశ్వాసంపొందినట్టే. ఒకవేళ విశ్వాసం పొందకపోతే జేడీ(ఎస్‌) నేత కుమారస్వామి కాంగ్రెస్‌ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఆయన పార్టీకి 37 సీట్లే వచ్చాయి. తొలుత ఆయనకు కూడా ముఖ్యమంత్రి పదవిపై ఎలాంటి ఆశా లేదు. భాజపాను దూరంగా పెట్టాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీయే ఆయన పేరును ప్రతిపాదించారు. ఒక వేళ ప్రభుత్వం ఏర్పాటయినా కలహాలు లేకుండా సుస్థిరంగా ఉంటేనే ప్రయోజనకరం. లేకుంటే తండ్రికి ఎదురయిన అనుభవాలే ఎదురవుతాయి. భాజపా అనుకూలంగా ఉపయోగించుకుంటుంది.