రెడ్‌ మి యూజర్లకు షాకింగ్ న్యూస్‌
Spread the love

భారత్ లో విపరీతమైన ఆదరణ పొందిన చైనా బ్రాండ్లలో షియోమి అగ్రస్థానంలో ఉంది. తన మార్కెట్ ను కాపాడుకోవడానికి కొత్త స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తూనే ఉంది.  తక్కువ బడ్జెట్‌ ఫోన్లతో భారతీయ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులను ఆకట్టుకున్న షియోమి సంస్థ  వినియోగదారులకు మరో బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. రెడ్‌ మి వినియోగదారులకు తక్షణమే  లోన్‌ అందించే సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తోంది.   వెయ్యి నుంచి లక్ష రూపాయల వరకు పర్సనల్ లోన్‌ను అందిస్తున్నట్లు  గురువారం వెల్లడించింది.  ఇందుకు  క్రెడిట్ బి (KreditBee )అనే సంస్థతో కలిసి షియోమి  ‘ఎంఐ క్రెడిట్ సర్వీస్’ అనే ప్రాజెక్ట్‌ను  ఇండియాలో ప్రారంభించినట్టు తెలిపింది. ఎంఐ క్రెడిట్ సర్వీస్ ప్రాజెక్ట్‌ కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను కూడా రూపొందించింది. ముఖ్యంగా  “యువ నిపుణులు కోసం తక్షణ వ్యక్తిగత రుణ వేదిక” ద్వారా ఆర్థిక రుణాన్ని అందివ్వనుట్టు షియోమి తెలిపింది. సాధారణ కేవైసీ ధృవీకరణతో కేవలం 10 నిమిషాల్లోఈ పక్రియ పూర్తవుతుందని  వివరించింది.

యంగ్‌ ప్రొఫెనల్స్‌ కోసం క్రెడిట్‌బీ సంస్థతో​ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు షియోమి ఇండియా వైస్ ప్రెసిడెంట్,  మేనేజింగ్ డైరెక్టర్ మను జైన్‌ చెప్పారు.  ‘ఎం ఐ క్రెడిట్‌’ మరో కీలక ముందడుగు అని  ఆయన అభివర్ణించారు. హార్డ్‌వేర్‌, ఇంటర్నెట్ సేవల మధ్య స్థిరమైన అనుసంధానంతో తమ స్మార్ట్‌ఫోన్లు యూజర్లకు మంచి అనుభవాన్ని అందించడానికి ఈ ప్లాట్‌ఫాం బాగా  ఉపయోగపడుతుందన్నారు. తమ వినియోగదారులకు ఇది నిజంగా లాభదాయకంగా ఉంటుందని తాము విశ్వసిస్తున్నామన్నారు.

ఇందుకోసం యూజర్లు తమ వివరాలను యూజర్‌ (ఆధార్‌,పాన్‌)ఎంఐ క్రెడిట్ సర్వీస్‌లో నమోదు చేసుకోవాలి. ఈ వివరాల ఆధారంగా కేవైసీ వెరిఫికేషన్‌ అనంతరం లోన్‌కు అర్హత ఉందా లేదా అనేది నిర్ధారిస్తారు. కేవలం పది నిమిషాల్లోపే ఈ ప్రక్రియ ముగుస్తుంది. కావాల్సిన లోన్ మొత్తాన్ని ఎంపిక చేసుకోవాలి.  వెరిఫికేషన్‌ అనంతరం  అర్హులైన వినియోగదారులకు  యూజర్ బ్యాంక్ అకౌంట్‌లో మనీ క్రెడిట్‌ అవుతుంది. ఈ విధంగా పొందిన పర్సనల్ లోన్‌పై 3 శాతం వడ్డీని వసూలు చేస్తారు. 15 నుంచి 90 రోజుల్లో లోన్ క్లియర్ చేయవచ్చు.  క్రెడిట్‌ బీ  యాప్‌ ద్వారా ఈ లోన్‌ను తిరిగి చెల్లించవచ్చు. అయితే ఈ అవకాశం ఎంఐయుఐ యూజర్లకు మాత్రమేనని,  షియోమి ఎంఐ ఎ1 లాంటి ఆండ్రాయిడ్‌ ఫోన్లకు ఈ లోన్‌ సదుపాయం వర్తించదని షియోమి స్పష్టం చేసింది.