ప్రత్యేక రోజుల్లో మహిళలకు అయ్యప్ప దర్శనం !
Spread the love

శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళలనూ అనుమతించే విషయమై సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉంటామని కేరళ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశంలో పునరుద్ఘాటించింది. గురువారం దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరక పోవడంతో బీజేపీ, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌ వాకౌట్ చేశాయి. రివ్యూ పిటిషన్లపై జనవరిలో విచారణ జరుపుతామని సుప్రీం ప్రకటించడంతో తీర్పు అమలును నిలుపుదల చేసేలా కొంతకాలం గడువు కోరాలంటూ ప్రతిపక్షాలు చేసిన డిమాండ్‌‌ను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తోసిపుచ్చారు. రాజ్యాంగం కంటే విశ్వాసం గొప్పదని ప్రభుత్వం చెప్పబోదని వ్యాఖ్యానించారు.

అలాగే, 10 నుంచి 50 ఏళ్ల మహిళల దర్శనానికి ప్రత్యేకంగా కొన్ని రోజులు కేటాయించాలని యోచిస్తున్నట్టు విజయన్‌ సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ విషయమై సంబంధిత పక్షాలతో చర్చిస్తామని, తీర్పుపై స్టే ఇవ్వనందున అమలు చేయడం మినహా గత్యంతరం లేదని, భక్తులు దీనిని అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర సర్కారు మొండిగా వ్యవహరిస్తోందని, సీఎం వైఖరి ఆమోదయోగ్యం కాదని ప్రతిపక్ష నేత రమేశ్‌ చెన్నితాల, బీజేపీ అధ్యక్షుడు పీఎస్‌ శ్రీధరన్‌ పిళ్లైలు విమర్శించారు.10-50 ఏళ్ల మహిళలు శబరిమలకు రావొద్దంటూ అభ్యర్థించడం మాత్రమే చేయగలమని రాజీవరు పేర్కొన్నారు. మరోవైపు, రెండు నెలల పూజలకు గాను గతంలో ఎన్నడూ లేనంత భద్రత నడుమ శుక్రవారం సాయంత్రం ఆలయాన్ని తెరవనున్నారు. గురువారం అర్ధరాత్రి నుంచే నిషేధాజ్ఞలు అమలు చేశారు.