సిమ్ కార్డు లేకుండా… పనిచేసే మొబైల్ ఫోన్.
Spread the love

వెయ్యి రూపాయల ఫోన్ అయినా… లక్ష రూపాయల ఫోన్ అయినా సిమ్ కార్డు ఉండాల్సిందే.. అది మామూలు సిమ్.. మైక్రో సిమ్ లేదా నానో సిమ్ ఏదో ఒకటి లేకపోతే ఫోన్ కాల్స్ మాట్లాడటానికి వీల్లేదు. అయితే త్వరలో సిమ్‌కార్డు అవసరం లేకుండానే పనిచేసే మొబైల్ ఫోన్లు మార్కెట్‌లోకి రానున్నాయి. కొన్ని కంపెనీలు సిమ్ కార్డులు లేకుండా ఫోన్లను పనిచేయించే దిశగా పరిశోధనలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆర్మ్ టెక్నాలజీ అనే సంస్థ మార్కెట్‌లోకి సిమ్‌కార్డు లేని ఫోన్లను తీసుకొచ్చింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఇటీవల ఆ ఫోన్‌ను ప్రదర్శించింది. అయితే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సదరు ఫోన్ యొక్క సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నది. కాంగ్రెస్ నుంచి ఆమోదం లభించినట్లయితే త్వరలోనే సిమ్‌లేని ఫోన్‌లు అందుబాటులోకి రావచ్చు.

ప్రాసెసర్‌తోనే పని చేస్తుందిలా..

ప్రస్తుతం కొనసాగుతున్న సిమ్ కార్డు ఫోన్‌లకు ప్రత్యామ్నాయంగా వచ్చే ఫోన్లలో ప్రాసెసర్ ఆధారంగా కొత్త టెక్నాలజీ తీసుకువస్తున్నారు. ప్రాసెసర్‌తోనే చిప్‌సెట్‌లో ఇంటిగ్రేటెడ్‌గా ఐ సిమ్‌ను జతపరుస్తారు. ఈ ఐ సిమ్ నంబర్‌ను ఫోన్‌లో ఎంపిక చేసుకునే నెట్‌వర్క్ కంపెనీలకు తెలియజేస్తే దానిని మొబైల్ నంబర్‌కు అనుసంధానం చేస్తారు. అంతే సిమ్‌లెస్ మొబైల్‌తో ఎంజాయ్ చేయడమే.

సిమ్ ఖర్చు లేదు…

ఈ కొత్త రకం ఫోన్ల కారణంగా సిమ్‌కార్డు ఖర్చు తగ్గుతుంది. ప్రస్తుతం కొన్ని నెట్‌వర్క్ సంస్థలు తమ వినియోగదారుల కోసం సిమ్‌కార్డు ఖర్చులను భరిస్తూ ఉచితంగా ఇస్తుండగా, మరి కొన్ని సంస్థలు వినియోగదారుల నుంచి రూ.50 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నాయి. జియో మార్కెట్‌లోకి వచ్చిన కొత్తలో ఒక్కో సిమ్‌కార్డు బ్లాక్ మార్కెట్‌లో రూ.2,000 వరకు విక్రయించిన సందర్భాలు ఉన్నాయి. కాగా తాజా పరిణామాలతో మొబైల్ నెట్‌వర్క్ సంస్థలకు లేదా వినియోగదారులకు ఈ అవస్థలు తొలగినట్టే.

సిమ్ కార్డు స్థలం ఆదా…

కొత్తగా వచ్చే ఫోన్‌లలో ప్రాసెసర్‌లో ఇమిడిపోయే ఐ సిమ్ వల్ల సిమ్‌కార్డు స్థలమూ ఆదా అవుతున్నది. చదరపు మిల్లీమీటర్ కంటే తక్కువ స్థలాన్ని ఐ సిమ్ ఆక్రమిస్తున్నది. నిన్న మొన్నటి వరకు వచ్చిన చాలా మొబైల్స్‌లో డ్యూయెల్ సిమ్ స్లాట్లు ఉండేవి. వాటిలో రెండు సిమ్‌లు లేదా ఒక సిమ్ ఒక మెమోరి కార్డు జతచేసేందుకు అవకాశం ఉండేది. అయితే రెండు సిమ్‌లు, ఒక మెమోరి కార్డు ఏకకాలంలో వాడుకోవాలనుకునే వారికి ఇబ్బంది అయ్యేది. తాజా టెక్నాలజీతో ఆ సమస్యకు పరిష్కారం లభిస్తున్నది.

Leave a Reply