కరుణానిధి నల్ల కళ్లద్దాలు, పసుపు రంగు శాలువా ఎందుకు ధరిస్తారంటే ?
Spread the love

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి.. అనగానే కళ్లకు నల్ల కళ్లద్దాలు, ఒంటిపై పసుపు రంగు శాలువా ధరించిన నిలువెత్తు రూపం గుర్తొస్తాయి. ఏడున్నర దశాబ్దాలుగా తమిళ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన కళైంజ్ఞర్‌ ఇంటా బయటా అదే స్టైల్‌లో కనిపించేవారు. ఈ రెండూ లేకుండా ఆయన కనిపించడం అరుదనే చెప్పుకోవాలి. ఇంతకీ నల్ల కళ్లద్దాలు,పసుపు రంగు శాలువా ఎందుకు ధరిస్తారనే విషయం చాలామందికి తెలియని రహస్యంగానే ఉండిపోయింది. అసలు నల్ల కళ్లద్దాల వెనక ఉన్న రహస్యమేంటో… డీఎంకే సీనియర్ నేత ఇలంగోవన్ గతంలో ఓ సందర్భంలో వివరించారు.1953లో కరుణానిధి పరమకుడిలో ఓ సన్మానసభకు హాజరై తిరిగి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆయన ఎడమ కంటికి స్వల్పంగా గాయమైంది. గాయం కారణంగా ఎడమ కన్ను అప్పుడప్పుడు వాచేది. మందులు వేసుకుంటే మళ్లీ మామూలు స్థితికి చేరేది. నల్ల కళ్లద్దాలు వాడితే కంటి సమస్య నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని వైద్యులు సూచించారు. వారి సలహా మేరకు నల్ల కళ్లజోడు ధరించడం మొదలుపెట్టారు. దాదాపు 46 ఏళ్లపాటు ఇటువంటి కళ్లద్దాలనే ధరించాడు .ఇక.. పసుపు రంగు శాలువా వేసుకుంటే… ఎంత మందిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఇట్టే గుర్తుపట్టవచ్చని, అందుకే కరుణ ధరిస్తారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అప్పటి నుంచి ఆయన వాటిని చివరిశ్వాస విడిచే వరకూ ధరిస్తూనే ఉన్నారు.