ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసిన వాల్‌మార్ట్‌
Spread the love

ప్రపంచ ఇ-కామర్స్‌ రంగంలో అతిపెద్ద ఒప్పందం చోటు చేసుకుంది. అమెరికన్‌ ఆఫ్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌. దేశీయ ఇ-కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ను చేజిక్కించుకుంది. సంస్థలో 77 శాతం వాటాను 1,600 కోట్ల డాలర్లకు (మన కరెన్సీలో సుమారు రూ.1.05 లక్షల కోట్లు) కొనుగోలు చేసింది. భారత మార్కెట్లో ఈ సంవత్సరం కుదిరిన అతిపెద్ద డీల్‌ ఇదే. అంతేకాదు అమెరికన్‌ సంస్థ వాల్‌మార్ట్‌కు సైతం ఇప్పటివరకు ఇదే అతిపెద్ద కొనుగోలు ఒప్పందం. ఈ డీల్‌ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్‌ మార్కెట్‌ విలువను 2,080 కోట్ల డాలర్లుగా (దాదాపు రూ.1.40 లక్షల కోట్లు) లెక్కగట్టారు. కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాతో(సిసిఐ)తోపాటు పలు ఏజెన్సీల నుంచి అనుమతులు అవసరమైన ఈ ఒప్పందం ఏడాది చివరికల్లా పూర్తయ్యే అవకాశం ఉంది.

ఈ ఒప్పందం తర్వాత ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన సచిన్‌ బన్సల్‌ సంస్థ నుంచి వైదొలగనున్నారు. తాజా ఒప్పందంలో భాగం గా సచిన్‌ బన్సల్‌ సంస్థలో తనకున్న 5.2 శాతం వాటాను వాల్‌మార్ట్‌కు విక్రయించనున్నారు. తద్వారా 100 కోట్ల డాలర్లు (సుమారు రూ.6,726 కోట్లు) సచిన్‌ జేబులోకి వెళ్లనున్నాయి. ఈ సంస్థలో అతిపెద్ద ఇన్వెస్టర్‌ అయిన సాఫ్ట్‌బ్యాంక్‌ కూడా తనకున్న 20 శాతానికి పైగా వాటాను వాల్‌మార్ట్‌కు విక్రయించనుంది.

5.5 శాతం వాటా కలిగిన బిన్ని బన్సల్‌ మాత్రం సంస్థలోనే కొనసాగనున్నారు. ఒప్పందం తర్వాత ఆయన కంపెనీ బోర్డుకు చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.సంస్థ సారథ్య బాధ్యతలు మాత్రం వాల్‌మార్ట్‌కు చెందిన క్రిష్‌ అయ్యర్‌ చేతుల్లోకి వెళ్లనున్నాయి.ఈ డీల్‌ పూర్తయ్యాక కూడా వాల్‌మార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌లు వేర్వేరు బ్రాండ్లుగానే వ్యాపారం నిర్వహించనున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ స్వతంత్ర బోర్డు కలిగి ఉండనుంది. ఒప్పందం తర్వాత బోర్డును పునర్వ్యవస్థీకరించనున్నారు.

ఈ ఒప్పందం కారణంగా 17.5 కోట్ల మంది వినియోగదార్లకు వాల్‌మార్ట్‌ చేరువవుతుంది. గత కొన్నేళ్లుగా భారత్‌లో పాగా వేయాలన్న కంపెనీ లక్ష్యం నెరవేరింది. భారత రిటైల్‌ విధానాల కారణంగా విదేశీ కంపెనీ ఏదీ నేరుగా ఇక్కడి వినియోగదార్లకు వస్తువులు విక్రయించడానికి అనుమతులు లేవు. ‘భారత్‌ అత్యంత ఆకర్షణీయమైన విపణి. ఇపుడు మా పెట్టుబడుల ద్వారా ఇంత పెద్ద విపణిలో గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకుంటామ’ని కంపెనీ ప్రెసిడెంట్‌, సీఈఓ డౌగ్‌ మెక్‌మిలన్‌ పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్‌ ప్రయాణంలో తదుపరి దశకు వాల్‌మార్ట్‌ మంచి భాగస్వామి అని బిన్నీ బన్సల్‌ పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో సచిన్‌ బన్సల్‌, బిన్నీ బన్సల్‌  ఒకొక్కరికి దాదాపు ఒక బిలియన్‌ డాలర్లు దక్కనున్నాయి. అమెరికాకు చెందిన అమెజాన్‌కు అనుబంధంగా ఉన్న అమెజాన్‌ ఇండియాకు ఫ్లిప్‌కార్ట్‌తో ఇప్పటికే పోటీ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో అమెరికా దిగ్గజ సంస్థ వాల్‌మార్ట్‌ మెజార్టీ వాటా కొనడంతో అమెజాన్‌ ఇండియాకు గట్టి పోటీ ఎదురు కానుంది.

ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసేందుకు వాల్‌మార్ట్‌తోపాటు అమెజాన్‌ కూడా ప్రయత్నించింది. భారత ఇ-కామర్స్‌ మార్కెట్లో ఏకచక్రాధిపత్యం కోసం ఫ్లిప్‌కార్ట్‌ను చేజిక్కించుకోవాలనుకుంది. కానీ ఫ్లిప్‌కార్డ్‌ బోర్డు మాత్రం వాల్‌మార్ట్‌వైపే మొగ్గు చూపించింది. అమెరికా ఆఫ్‌లైన్‌ రిటైల్‌లో వాల్‌మార్ట్‌, ఆన్‌లైన్‌లో అమెజాన్‌ దిగ్గజ సంస్థలు. ఈ రెండింటి మధ్య చాన్నాళ్లుగా ప్రత్యర్థి వైరం కొనసాగుతోంది. ప్రస్తుతం అమెరికా మార్కెట్‌కే పరిమితమైన ఈ పోటీని వాల్‌మార్ట్‌ భారత్‌కు విస్తరించాలనుకుంటోంది. అందుకే అమెజాన్‌ ప్రధాన ప్రత్యర్థి ఫ్లిప్‌కార్ట్‌లో వాటా కొనుగోలు చేస్తోంది. వాల్‌మార్ట్‌కు వాటా విక్రయం ద్వారా సమకూరే నిధులతో ఫ్లిప్‌కార్ట్‌ అమెజాన్‌కు మరింత గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంటుంది.