‘అరవింద సమేత’ కథ నాది.. త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు : వేంపల్లి గంగాధర్
Spread the love

తాజాగా విడుదల అయిన ‘అరవింద సమేత’ సినిమా అద్భుతమైన సక్సెస్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్ర కథ తనదేనంటూ ప్రూఫ్‌లతో సహా వేంపల్లి గంగాధర్ అనే వ్యక్తి బయటపెట్టారు. మొండికత్తి పేరుతో తను రాసిన కథనాన్ని కూడా బయటపెట్టారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘త్రివిక్రమ్ గారి నుంచి మొదటి సారిగా ఏప్రిల్ 15 వ తేదీ మధ్యాహ్నం ఫోన్ వచ్చింది. అర్జెంట్‌గా హైదరాబాద్ రమ్మని కోరారు. ఆ సమయంలో రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్టీఆర్ తో షూటింగ్ మొదలుపెడుతున్నారు. నేను అక్కడకి చేరుకున్న సమయంలో సినిమాలో మొదటి ఫైట్ చిత్రీకరిస్తున్నారు.

ఆ తరువాత నాతో పరిచయం చేసుకున్న త్రివిక్రమ్ నా పుస్తకాల గురించి అడిగి తెలుసుకున్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి నేను రాయలసీమ ఫ్యాక్షన్ కథలపై చేసిన రీసెర్చ్ గురించి తెలుసుకొని నన్ను అభినందించారు. రీసెర్చ్ సమయంలో నేను పడిన కొన్ని ఇబ్బందులు,కొంత సమాచారం ‘హిరణ్య రాజ్యం’ అనే పుస్తక రూపంలో వచ్చిందని ఆయనకి చెప్పాను.. సినిమాలో హీరోయిన్ పాత్రకి దాన్ని వాడుకున్నారు. షూటింగ్ స్పాట్ నుండి హోటల్ కి చేరుకున్నాం. నాతో కూర్చొని ఫ్యాక్షన్ కథల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. పాపాగ్ని కథల్లో ఉన్న మొదటి కథ ‘మొండి కత్తి’ నేపథ్యం గురించి చెప్పమన్నారు.

ఇంత వరకు నేను రాసిన కక్షల కథలు -అందులోని కథల మూలాల గురించి అడిగి తెలుసుకున్నారు. సినిమాలో పదే పదే వచ్చే మొండి కత్తి కథకు పునాది అదే. అతడిని కలవడం, నా కథల గురించి లోతుగా చెప్పడం నేను చేసిన మొదటి తప్పు. మూడు రోజులు నేను వారితో కలిసి ఉచితంగా వర్క్ చేశాను. తెర పైన పేరు వేయకుండా ఇతరుల కథలను వాడుకునే స్వభావం ఉన్న దర్శకుడిని కలవడం వల్ల ఇలా కూడా మనం మోసపోతూ ఉంటాం. త్రివిక్రమ్ ఒక తెలివైన మూర్ఖుడు. మనం రాసిన అన్ని కథల్లోంచి ఒక్కో పాత్రను దొంగిలించి ఇంకో కొత్త రకం వంటకం వండ గలడు. అలా వండిన కథే ‘అరవింద సమేత’!’’ అని గంగాధర్ తను పెట్టిన పోస్టులో వెల్లడించారు.