టిక్‌టాక్‌కు అమెరికా 5.7 మిలియన్‌ డాలర్ల జరిమానా !
Spread the love

చైనా సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌కు అమెరికా గట్టి షాక్‌ ఇచ్చింది.పదమూడేళ్ల లోపు చిన్నారుల డేటాను అక్రమంగా సేకరిస్తోందన్న కారణంగా టిక్‌టాక్‌ యాజమాన్యానికి ఫెడరల్‌ ట్రేడ్‌ ‍కమిషన్(ఎఫ్‌టీసీ)‌.. 5.7 మిలియన్‌ డాలర్ల(దాదాపు 40. 60 కోట్ల రూపాయలు) భారీ జరిమానా విధించింది.ఎఫ్‌టీసీ నిర్ణయం పట్ల టిక్‌టాక్‌ యాజమాన్యం స్పందించింది. అమెరికా చట్టాలకు అనుగుణంగానే తమ యాప్‌ పనిచేస్తోందని, ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని పేర్కొంది. 13 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు పూర్తి స్థాయిలో యాక్సెస్‌ కల్పించలేదని, తమ యూజర్ల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరణ ఇచ్చింది.

అమెరికాలో దాదాపు 65 మిలియన్ల మంది టిక్‌టాక్‌ యూజర్లు ఉన్నారు. మోస్ట్‌ పాపులర్‌ యాప్‌ విభాగంలో గూగుల్‌, ఆపిల్‌ డివైస్‌లలో వరుసగా నాలుగు, 25వ స్థానాల్లో ఉందంటే టిక్‌టాక్‌ ఉన్న క్రేజ్‌ అంత ఇంతా కాదు చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ వినియోగిస్తున్నారు.ఈ కారణంగా పదమూడేళ్ల లోపు చిన్నారుల వ్యక్తిగత విషయాలు బహిర్గమవుతున్నాయి. ఇది అమెరికా చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుంది. అందుకే 5.7 మిలియన్‌ డాలర్ల జరిమానా విధించాం. చిన్నారుల భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టిక్‌టాక్‌ వంటి మరెన్నో సోషల్‌ మీడియా యాప్‌లకు, సైట్‌లకు ఈ జరిమానా కనువిప్పు కలిగిస్తుందని ఆశిస్తున్నాం’ అని ఎఫ్‌టీసీ చైర్మన్‌ జో సైమన్స్‌ పేర్కొన్నారు.