నేడు ఎంగిలిపూల బతుకమ్మ…తొమ్మిదిరోజులపాటు పూలజాతర
Spread the love
 • బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
 • నేడు ఎంగిలిపూల బతుకమ్మ
 • తొమ్మిదిరోజులపాటు పూలజాతర
 • 17న సద్దుల బతుకమ్మ
 • దేశ, విదేశాల్లో ఘనంగా వేడుకలు

తెలంగాణకే ప్రత్యేకమైన పూలపండుగ మంగళవారం నాడు మొదలవుతున్నది. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే వేడుకలు తొమ్మిదిరోజులు కొనసాగనున్నాయి. శీతాకాలం ఆరంభంలో ఈ పండుగకు ప్రకృతి స్వాగతం పలుకుతున్నది. గుమ్మడి, తంగేడు, గునుగు, రుద్రా క్ష, బీర, బంతి, కట్టపూలు, గన్నేరు, అడవిమల్లె, సీతమ్మ జడపూలు.. ఇలా తీరొక్క పూలతో బతుకమ్మను ముస్తాబు చేస్తారు. బతుకమ్మకు ఒక్కోరోజు పెట్టే నైవేద్యాన్ని బట్టి ఒక్కోపేరుతో పిలుస్తారు. బతుకమ్మ సంబురాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. మంగళవారం నాడు నుంచి 17 వరకు జరిగే వేడుకల ప్రారంభ కార్యక్రమాన్ని హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించనున్నారు. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరుగనున్నాయి. ముంబై, బెంగళూరు, సూరత్, భీవండి పట్టణాలతోపాటు అమెరికా, లండన్, యూరప్, ఆస్ట్రేలియా, మలేషియా, డెన్మార్క్, సింగపూర్ తదితర దేశాల్లోనూ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోనున్నారు.

హైదరాబాద్‌లో 9 రోజుల పాటు…

బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. గతేడాది కంటే ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి అన్ని శాఖలను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్, పీపుల్స్‌ప్లాజా, రవీంద్రభారతి, బైసన్‌పోలో, పరేడ్‌గ్రౌండ్స్, తెలంగాణ కళాభారతి మైదానాల్లో 9 రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సద్దుల బతుకమ్మ రోజున 21 దేశాలకు చెందిన మహిళలు ఉత్సవాల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.   అన్ని జిల్లాల్లో, ఢిల్లీల్లోని తెలంగాణభవన్‌లోనూ బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.

 • బతుకమ్మ పండుగ సందర్భంగా పర్యాటక శాఖ పీపుల్స్‌ ప్లాజాలో ఆహార పండుగ(ఫుడ్‌ ఫెస్టివల్‌)ను నిర్వహించనుంది.
 • సద్దుల బతుకమ్మ రోజున ట్యాంక్‌బండ్‌ వద్ద లేజర్‌ షో, టపాకాయల వెలుగుల మధ్య సాంస్కృతిక ప్రదర్శలుంటాయి. పరిశ్రమలు, ఐటీ సంస్థల ఆధ్వర్యంలో పూల శకటాల ప్రదర్శన ఉంటుంది.
 • బతుకమ్మ కోసం ఈ సారి 12 దేశాల నుంచి వివిధ రకాల పుష్పాలు రప్పిస్తున్నారు.
 • బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో 25 విదేశాల మహిళలు ఉత్సవాల్లో పాల్గొననున్నారు.
 • వెయ్యి మంది అంధ, బధిర, దివ్యాంగ మహిళలతో హైటెక్స్‌లో ఉత్సవాలు నిర్వహిస్తారు.
 • 18.19వ తేదీల్లో బైసన్‌పోలో మైదానం, పరేడ్‌ మైదానం, పీపుల్స్‌ ప్లాజా, ఎన్టీఆర్‌ స్టేడియం ప్రాంతాల్లో 50 మంది పారా గ్లైడర్ల సాయంతో ఆకాశంలో పూల ప్రదర్శన ఈ దఫా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
 • బతుకమ్మ సందర్భంగా బాలికలకు వైద్యపరీక్షలు నిర్వహించి, ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 • రవీంద్రభారతిలో 9 నుంచి 16 వరకు బతుకమ్మపై ఫిల్మోత్సవం. ధారావాహికలను ప్రదర్శించనున్నారు.
 • మాదాపూర్‌ ఆర్ట్‌ గాలరీలో 55 దేశాలకు చెందిన ఫోటో గ్రాఫర్ల ఛాయా చిత్రాల ప్రదర్శన ఉంటుంది.13న ఎంసీహెచ్‌ఆర్డీలో అఖిల భారత సర్వీసు శిక్షణాధికారులు, వాళ్ల సతీమణుల ఆధ్వర్యంలో ఉత్సవాలు.