నిశ్శబ్ద విప్లవం ఉంది… ఊహించ‌ని విధంగా ఎన్నిక‌ల ఫ‌లితాలు ఉంటాయి
Spread the love

రాజ్యాధికారం చేప‌ట్టడానికి బ‌హుజ‌న స‌మాజ్ వాది పార్టీకి 25 ఏళ్లు ప‌డితే.. జ‌న‌సేన పార్టీ మాత్రం ఐదేళ్ల‌లో సాధించ‌ బోతోందని ‌పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మ‌న్ శ్రీ మాదాసు గంగాధరం తెలిపారు. రాష్ట్రంలో నిశ్శ‌బ్ద విప్ల‌వం ఉందని, ఎవ‌రూ ఊహించ‌ని విధంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు రాబోతున్నాయ‌న్నారు.

సోమ‌వారం కాకినాడ‌లో స్పంద‌న ఫంక్ష‌న్ హాల్ లో కాకినాడ పార్ల‌మెంట‌రీ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల ఆత్మీయ స‌మావేశం జ‌రిగింది. జనసేన ముఖ్య నేతలు హాజరై పోలింగ్ సంద‌ర్భంగా అభ్య‌ర్ధుల‌కు ఎదురైన అనుభ‌వాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా శ్రీ మాదాసు గంగాధరం మాట్లాడుతూ “జ‌న‌ సైనికులు అంటే అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారికి ప్రాణం. మీరు వెనుక ఉన్నార‌న్న న‌మ్మ‌కంతోనే మార్పు కోసం పోరాటం చేస్తున్నారు. స‌ర్వేల్లో ఆ పార్టీ విజ‌యం సాధిస్తుంది…. ఈ పార్టీ విజ‌యం సాధిస్తుంది అని చెబుతున్నారు. మాకు స‌ర్వేల‌తో సంబంధం లేదు. మా పార్టీకి ప్ర‌జాసేవే ముఖ్యం. రాజ్యాధికారం అంద‌ని అనేక కులాలు, వ‌ర్గాల‌ను అంద‌లం ఎక్కించాల‌ని ఆయ‌న కృషి చేస్తున్నారు. తూర్పుగోదావ‌రి జిల్లా జ‌న‌సేన పార్టీకి గుండెకాయ‌లాంటిది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో క్షేత్ర‌స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసి గ్రామ గ్రామాన జ‌న‌సేన జెండా రెప‌రెప‌లాడేలా కృషి చేయాలి. రాజ‌కీయాల్లో కొంత‌మందికే అవ‌కాశం వ‌స్తుంది. అలా వ‌చ్చిన వారు గొప్ప‌వారు కాదు, రానివారు త‌క్కువ కాదు. జ‌న‌ సైనికులు, నాయ‌కులు చిన్న చిన్న విభేదాల‌ను ప‌క్క‌న పెట్టి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాల‌”ని  చెప్పారు.

జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ సలహాదారుడు శ్రీ పి.రామ్మోహన్ రావు మాట్లాడుతూ “గ్రామ‌స్థాయిలో రాజ‌కీయాధికారం రావాలంటే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో గెలుపే ముఖ్యం. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ల‌క్ష‌లాది మంది జ‌న‌ సైనికులు పార్టీకోసం ప‌నిచేశారు. అర్హులైన చాలామందికి పోటీ చేసే అవ‌కాశం ఇవ్వ‌లేక‌పోయాం. దీనికి కార‌ణం ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ప‌రిమిత సంఖ్య‌లో ఉండ‌ట‌మే. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన ప్ర‌తి ఒక్క‌రికి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అవ‌కాశం క‌ల్పిస్తాం. గ్రామ‌స్థాయిలో రాజ్యాధికారానికి దూరంగా ఉన్న అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లను క‌లుపుకొని రాజ్యాధికారం చేప‌డ‌తాం. కాకినాడ‌ లోక్ స‌భ ప‌రిధిలో 273 పంచాయితీలు, 3281 వార్డులు ఉన్నాయి.  అన్ని ప‌ద‌వులు జ‌న‌ సైనికులు చేప‌ట్టేలా కార్యాచ‌ర‌ణ త‌యారు చేశాం. దీని కోసం ప్ర‌తి గ్రామంలో వార్డు క‌మిటీలు వేస్తాం.  ప్ర‌తి వార్డుకు ఐదు నుంచి ప‌ది మంది సభ్యులు ఉండేలా చూస్తాం. దీర్ఘ‌కాలికంగా గ్రామాల‌ను ప‌ట్టిపీడిస్తున్న స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే విధంగా ప్ర‌తి రోజు కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం, ఆస‌రా లేని వృద్ధుల‌కు అండ‌గా ఉండ‌టం, మ‌హిళ‌ల‌కు వృత్తి విద్యల‌లో శిక్ష‌ణ ఇప్పించి ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్స‌హించ‌డం ఇలాంటి ప‌నులు చేప‌ట్ట‌డం ద్వారా  ఆప‌దొచ్చినా, అనారోగ్య‌మొచ్చినా జ‌న‌ సైనికులు ఇంటికి పెద్ద కొడుకులా అండ‌గా ఉంటార‌నే భ‌రోసా ప్ర‌జ‌ల్లో క‌ల్పించాలి. ప్ర‌జ‌లంద‌రూ ఆరోగ్యంగా, ఆనందంగా, ఆర్థికంగా సంతోషంగా ఉండేలా జ‌న‌సేన పార్టీ కార్యాచ‌ర‌ణ రూపొందిస్తుంది. మొన్న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎదురైన ఇబ్బందులను అధిగమించి  గ్రామ‌స్థాయిలో అధికారం అందిపుచ్చుకోవడానికి జ‌న‌ సైనికులు తీవ్రంగా కృషి చేయాల‌”ని కోరారు.

జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి పొలిటిక‌ల్ సెక్ర‌ట‌రీ శ్రీ పి. హ‌రిప్ర‌సాద్ మాట్లాడుతూ “స‌ముద్రంలో అల్ప‌పీడ‌నం ఏర్పడి వాయుగుండంగా మారి తుపాన్ గా ప్ర‌తాపం చూపిస్తుంది. అదేవిధంగా 2014లో జ‌న‌సేన పార్టీ అల్ప‌పీడ‌నంగా ఏర్ప‌డి మొన్న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వాయుగుండంగా మారి తుపాన్ లా విరుచుకుప‌డింది. ఆ తుపాన్ తాకిడికి ఏ పార్టీలు కొట్టుకుపోతాయే తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి నిబ‌ద్ధ‌త‌, నిజాయ‌తీ కార‌ణంగా ప్ర‌త్య‌ర్ధుల‌కు నిద్ర ప‌ట్ట‌డం లేదు. జ‌న‌సేన ప్ర‌భ‌జ‌నం ఎలా ఉంటుందో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ధర్మో రక్షతి రక్షితః అనే సూక్తిని శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు గ‌ట్టిగా విశ్వ‌సిస్తారు. అవినీతిమ‌య‌మైన రాజ‌కీయాల్లో ధ‌ర్మాన్ని నిల‌బెట్ట‌డానికే ఆయ‌న జ‌న‌సేన పార్టీ పెట్టారు. రాజ‌కీయాలన్నా, రాజ‌కీయ నాయ‌కుల‌న్నా జ‌నంలో చిన్న‌ చూపు ఉండే త‌రుణంలో శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు జ‌న‌సేన పార్టీ స్థాపించి మ‌ళ్లీ రాజ‌కీయాల‌కు, రాజ‌కీయ నాయ‌కుల‌కు ఒక గౌర‌వం తీసుకొచ్చారు. అలాంటి వ్య‌క్తితో క‌లసి ప‌నిచేయ‌డం పూర్వ జ‌న్మ సుకృతం. రాష్ట్రానికి ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారితోనే సాధ్యం. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గెలుపోట‌ములు ప‌క్క‌నపెడితే, త‌క్కువ స‌మ‌యంలో అతి త‌క్కువ వ‌న‌రుల‌తో జ‌న‌ సైనికులు చేసిన పోరాటం అద్భుతం. ఆ పోరాట ఫ‌లితంగానే రాష్ట్రంలో అనూహ్య‌మైన ఫ‌లితాలు రాబోతున్నాయి. మ‌రోసారి మ‌న స‌త్తాను నిరూపించుకోవ‌డానికి రెండు, మూడు నెల‌ల్లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు రానున్నాయి. ఈ ఎన్నిక‌లు ప్ర‌తి జ‌న‌ సైనికుడికి గొప్ప అవ‌కాశం. ఎన్నిక‌ల్లో గెలిచి గ్రామ‌గ్రామాన జ‌నసేన జెండాను రెప‌రెప‌లాడించడానికి స‌మిష్టింగా కృషి చేయాల‌”ని కోరారు. ఈ స‌మావేశానికి కాకినాడ పార్ల‌మెంట‌రీ రీజ‌న‌ల్ సెక్ర‌ట‌రీ శ్రీ క‌ల‌వ‌కొల‌ను తుల‌సీరామ్ అధ్య‌క్ష‌త వ‌హించారు. పార్టీ ముఖ్యులు శ్రీ  ముత్తా గోపాల‌కృష్ణ, శ్రీ వై. న‌గేష్  పాల్గొన్నారు. స‌మావేశం అనంత‌రం కాకినాడ పార్ల‌మెంట‌రీ ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి రివ్యూ నిర్వ‌హించారు. జ‌న‌సేన అభ్య‌ర్ధి, ఆ నియోజ‌క‌వ‌ర్గ పార్టీ ముఖ్యులు హాజ‌ర‌య్యారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి విడివిడిగా రివ్యూ నిర్వ‌హించారు.