ఫిబ్రవరిలోనే పంచాయతీ ఎన్నికలు !
Spread the love

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను జనవరి 10లోగా పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ ఆ దిశగా కార్యాచరణ పూర్తయ్యేలా కనిపించడం లేదు. మూడు దశల్లో ఎన్నికలు ముగియడానికి ఫిబ్రవరి మొదటి వారం వరకు పడుతుందని ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. రిజర్వేషన్ల ఖరారులో జాప్యం, ఒక్కో పోలింగ్‌కు మధ్య మునుపటిలా మూడేసి రోజులు కాకుండా నాలుగైదు రోజులు గ్యాప్ ఇవ్వాలని ఈసీ యోచిస్తుండటంతో ఎన్నికల ప్రక్రియ ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో గడువు తేదీ జనవరి 10లోగా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించాలని అనుకుంటున్నట్లు సమాచారం.

పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ఎస్‌ఈసీ గతంలో హైకోర్టుకు వెళ్లగా.. మూడు నెలల్లోగా పూర్తి చేయాలంటూ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో జనవరి 10లోగా ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం, ఎస్‌ఈసీ సన్నాహాలు చేస్తున్నాయి. ఇంతలో రిజర్వేషన్లు గరిష్ఠంగా 50 శాతం మాత్రమే ఉండాలంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేయటంతో.. ఇంతకు ముందు 60.19 శాతంతో తయారు చేసిన రిజర్వేషన్ల స్థానే సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు కొత్త సూత్రీకరణలు అవసరమయ్యాయి. దీంతో రిజర్వేషన్లను డిసెంబరు 29లోగా ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ గడువు ఇచ్చింది.

జిల్లాల నుంచి వచ్చే ప్రతిపాదనలు పరిశీలించి గెజిట్‌ ప్రకటన వెలువడేసరికి మరో నాలుగైదు రోజులు అవసరం. తర్వాత ప్రభుత్వం నుంచి ఆ వివరాలు ఎస్‌ఈసీకి వెళ్లాలి. ఎస్‌ఈసీ నాలుగైదు రోజులైనా తీసుకుంటుంది. ఎందుకంటే లక్షల సంఖ్యలో ఉండే ఎన్నికల సిబ్బందిని అప్రమత్తం చేయటం అవసరమని ఒక అధికారి పేర్కొన్నారు. ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి ఒక్కో దశ ముగియటానికి 15 రోజులు అవసరమని ఎస్‌ఈసీ వర్గాలు తెలిపాయి. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పోలింగ్‌ తదితర పనులన్నీ ఈ వ్యవధిలో చేపడతారు. ఎన్నికల నోటిఫికేషన్‌ను జనవరి 10లోగా ఇచ్చినప్పటికీ మూడు దశలు కొలిక్కివచ్చేసరికి ఫిబ్రవరి మొదటి వారం కావచ్చని అంచనా.