ఆ క్రెడిట్ లో కొంత.. పవన్ కి ఇవ్వాల్సిందే
Spread the love

ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. నువ్వా నేనా అన్నట్టు పార్టీలన్నీ పోటీ పడ్డాయి. ఓటింగ్ శాతం కూడా గణనీయంగా పెరిగింది. దాదాపు 85 శాతం ఓటింగ్ నమోదయ్యింది. నిర్ణీత సమయం ముగిసిన తరవాత కూడా.. పోలింగ్ సాగింది. కొంతమంది లైన్లలో నిలబడలేక వెనుదిరిగారు కూడా. తెలంగాణతో పోలిస్తే… ఏపీలో ఎక్కువ శాతం పోలింగ్ నమోదయ్యింది. మహిళలతో పాటు యువతరం కదిలి వచ్చి తమ ఓటు హక్కుని ఉపయోగించుకున్నారు. ఓటింగ్ శాతం పెరగడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అయితే ఆ క్రెడిట్ లో కొంత పవన్ కల్యాణ్ కీ ఇవ్వాల్సిందే. పవన్ అభిమానుల్లో యువతరం ఎక్కువ. ఆ మాటకొస్తే… పవన్ అభిమాని అంటేనే.. తను యూత్ లో ఉన్నట్టు లెఖ్ఖ. పవన్ తొలిసారి ప్రత్యక్ష రాజకీయాలలోకి దిగాడు. పవన్ ప్రచారం అంతా యువతరమే చూసుకుంది. సోషల్ మీడియాలో వాళ్ల హవానే ఎక్కువగా కనిపించింది. మరీ ముఖ్యంగా కోస్తా జిల్లాలలో పవన్ అభిమానులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలిసారి ఓటు హక్కు పొందినవాళ్లు దాదాపుగా పవన్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. పవన్ తన ప్రచారంలో భాగంగా యువతరంతో సభలు, సమావేశాలు ఏర్పాటు చేశాడు. అయితే అవి పార్టీ ప్రచార సభల్లా కాకుండా ఇష్టా గోష్టీ కార్యక్రమాల్లా సాగాయి. తమ అభిప్రాయాలను యువతరం పవన్ కి పూస గుచ్చినట్టు చెప్పింది. పవన్ కూడా హమీలపై హామీలు గుప్పించకుండా, ఫక్తు రాజకీయనాయకుడిలా మాట్లాడకుండా.. యువతరం సానుభూతిని పొందగలిగాడు. దాంతో.. యువత జనసేన వైపు మొగ్గు చూపించింది. వాళ్లంతా పోలింగ్ కేంద్రాలకు తమ కుటుంబ సభ్యుల్ని కూడా రప్పించగలిగారు. అయితే.. వాళ్లంతా పవన్ ని నమ్మారా పవన్ కే ఓటేశారా అనే విషయాలు పక్కన పెడితే… తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలన్న ఆలోచన మాత్రం రేకెత్తించగలిగాడు. పోలింగ్ రోజున ఫేస్ బుక్కులకు, క్రికెట్ మ్యాచులకు, సినమాలకూ పరిమితం కాకుండా.. బయటకు రాగలిగారు. పోలింగ్ శాతం పెరగడానికి అది కూడా ఓ కారణంగా నిలిచింది.

Read more at telugu360.com: ఆ క్రెడిట్ లో కొంత.. పవన్ కి ఇవ్వాల్సిందే – https://www.telugu360.com/te/some-of-the-credit-for-increased-polling-goes-to-pawan/