కొత్త ఫీచర్లతో డ్రైవింగ్ లైసెన్స్
Spread the love

ఉద్యోగాల రీత్యా దేశంలోని వివిధ ప్రాంతాలకు బదిలీ అయ్యే ఉద్యోగులు, వాహన డ్రైవర్ల ట్రాఫిక్ వెతలు ఇక తీరనున్నాయి. దేశవ్యాప్తంగా 2019, జూలై నుంచి ఒకే డ్రైవింగ్ లైసెన్స్ విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు సరికొత్త డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు (ఆర్సీ) జారీచేయనున్నారు. కొత్తగా జారీచేసే స్మార్ట్ కార్డులపై మైక్రోచిప్, క్యూఆర్ కోడ్‌లను ముద్రించనున్నారు. కార్డు వివరాల్ని వేగంగా గుర్తించడానికి వీటిలో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ) ఫీచర్‌ను ఇన్‌స్టాల్ చేయనున్నారు.

అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే రంగు, ఒకే డిజైన్, ఒకే సెక్యూరిటీ ఫీచర్లతో ఈ సరికొత్త డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు ప్రవేశపెట్టనున్నారు. ఇండియన్ యూనియన్ డ్రైవింగ్ లైసెన్స్ పేరుతో దీన్ని జారీ చేస్తారు. వాహన డ్రైవర్ పేరు, బ్లడ్ గ్రూప్, అవయవదానం చేస్తామంటూ ఇచ్చే డిక్లరేషన్ వివరాల్ని కూడా కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌ పై పొందుపరుస్తారు.  ఒకవేళ దివ్యాంగులైతే వారి కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వాహనం ఉంటే ఆ వివరాల్ని కార్డుపై ముద్రిస్తారు. ఈ స్మార్ట్ కార్డుల ప్రక్రియ నిరంతరం సాగుతుందని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వశాఖ ఇప్పటికే ప్రారంభించిందని తెలిపారు. ఈ కొత్త కార్డుల ధర 15 నుంచి 20 రూపాయలకు మించకపోవచ్చని ఆయన వెల్లడించారు.

వాహనం కాలుష్య నియంత్రణ పరీక్షను రెగ్యూలర్‌గా చేయిస్తున్నారా? లేదా? అని తెలిపే ఫీచర్‌ను సైతం ఆర్సీలో పొందుపర్చాం. తద్వారా వాహనం బీఎస్-4/బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నదా? లేదా? అనే విషయం తెలిసిపోతుంది. ప్రతీ అంశం ఇందులో నమోదవుతుంది అని సదరు అధికారి వివరించారు. లైసెన్సు, ఆర్సీ స్మార్ట్ కార్డుల జారీ ద్వారా వాహనాలు, డ్రైవర్లకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని సులువుగా తెలుసుకోవచ్చని ఆయన వెల్లడించారు. తాజా స్మార్ట్ కార్డుల ద్వారా కేంద్రం నిర్వహణలోని సెంట్రల్ డాటాబేస్‌లో వాహన్(వాహనాలు), సారథి(డ్రైవర్ల)కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నిల్వ చేయవచ్చని చెప్పారు.