అందుకే ఆ ఇద్దరినీ మ్యాచ్‌ రిఫరీ మందలించాడు
Spread the love

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌లో శుక్రవారం ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌-ఢిల్లీ డేర్‌డెవిల్స్‌  జట‍్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో అరుదైన సందర్భం చోటు చేసుకుంది. ఐపీఎల్‌లో మరో ఇద్దరు బౌలర్లను మ్యాచ్‌ రిఫరీ మందలించాడు. వారిద్దరిలో ఒకరు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చెందిన శివమ్‌ మావి కాగా, రెండో ఆటగాడు దిల్లీ డేర్‌డెవిల్స్‌కు చెందిన అవేశ్‌ ఖాన్‌.

టోర్నీలో భాగంగా శుక్రవారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ కాస్త అతిగా ప్రవర్తించారు. ఈ కారణంగానే వారిని రిఫరీ మందలించాడు.మ్యాచ్‌ మధ్యలో వికెట్లు దక్కించుకున్న ఆనందంలో ఈ ఇద్దరూ ఆటగాళ్లు అతిగా ప్రవర్తించారు. కాస్త మితి మీరినట్టు సంబరాలు చేసుకున్నారు. ఆటగాళ్లను మందలించడానికి ఇదే కారణంగా తెలుస్తోంది. దీంతో ఐపీఎల్‌ ఆటగాళ్ల, అధికారుల నియమావళిలోని సెక్షన్‌  2.1.7లో లెవల్‌ 1 ప్రకారం వారు చేసింది తప్పని రిఫరీ నిర్ధరించారు.

అనంతరం విచారణలో వీరిద్దరూ తమ తప్పును ఒప్పుకోవడంతో కేవలం మందలింపుతో రిఫరీ సరిపెట్టాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 55 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు శివమ్‌ మావి ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి 58 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. మరోపక్క ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ బౌలర్ అవేశ్‌ ఖాన్ 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి రెండు వికెట్లను దక్కించుకున్నాడు.