పవన్ కొత్త స్టైల్ వెనుక అసలు కథ..
Spread the love

ఎన్నికల్లో ఏమాత్రం  పర్ఫార్మ్ చేస్తాడో కానీ ఎన్నికల ముందు – తరువాత కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిగ్గానే ఉంటున్నాడు. ప్రచార సమయంలో చెట్టు కింద కూర్చుని మట్టి పాత్రలో పెరుగన్నం తింటూ ఫొటోలు దిగినా.. లేదంటే కారు లగేజ్ స్పేస్ లో తలకింద చేయి పెట్టుకుని శేషతల్పంపై విష్ణుమూర్తి ఫోజిచ్చినా అన్నీ వైరల్ అయ్యాయి. పోలింగ్ పూర్తయిన సాయంత్రం జనసేన ఆఫీసులోనే కొత్త రేడియో పట్టుకుని పాత పాటలు వింటూ ఆయన దిగిన ఫొటో కూడా సంచలనంగానే మారింది. అలాంటి పవన్ కల్యాణ్ కు సంబంధించిన మరో ఫొటో ఇప్పుడు రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

నిన్నటి మొన్నటి వరకు జులపాల జుత్తు – గుబురుగా పెరిగిన గడ్డంతో కనిపించిన పవన్ ఈ ఫొటోలో నున్నగా షేవ్ చేసుకున్న గడ్డం – బుద్ధిమంతుడి క్రాఫ్ తో కనిపిస్తున్నాడు. ఇది పవన్ కల్యాణ్ న్యూ లుక్ అంటూ దాన్ని నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. కొన్ని టీవీ చానళ్లు కూడా ఈ ఫొటో పట్టుకుని కథలు అల్లేసి అరగంట ప్రోగ్రాంలూ నడిపించేశాయి. ఇక ఇదే అదను అదే పదును అనుకుంటూ పవన్ విమర్శకులు కూడా తమ నోళ్లకు పనిచెప్పారు. రాజకీయాల్లో పనైపోయింది కాబట్టి మళ్లీ గో బ్యాక్ టు సినిమాస్ అంటూ పవన్ తయారైపోతున్నాడంటూ విమర్శలు కురిపించారు.

అయితే.. అసలు విషయం మాత్రం వేరంటున్నారు. ఆ ఫొటో ఇప్పటిది కాదని – కొద్దికాలం కిందటి ఫొటో అని పవన్ సన్నిహితులు చెబుతున్నారు. పవన్ గడ్డం గీయించుకోలేదని – హెయిర్ కట్ చేయించుకోలేదని.. పోలింగ్ రోజు వరకు ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలానే ఉన్నాడని చెబుతున్నారు. మరి.. మే 23న ఎన్నికల ఫలితాల తరువాతయినా పవన్ స్టైల్ మారుస్తాడో లేదంటే ఈ స్టైల్ కే ఫిక్సయిపోతాడో చూడాలి.