ఎక్కువ మంది మెట్రోలో ప్రయాణిoచకపోవడానికి కారణం…ఇదేనంట!
Spread the love

రైల్వే ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించేందుకు ఎక్కువగా ఆసక్తిని కనబరచడం లేదు. దీనికి ప్రధాన కారణం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు మెట్రో స్టేషన్‌కు అనుసంధానం లేకపోవడమే. ఈ రెండు స్టేషన్లకు మధ్య ఉన్న 250-300 మీటర్ల దూరాన్ని అనుసంధానం చేస్తూ స్కైవేలను ఏర్పాటు చేస్తే మెట్రోలో ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవచ్చు. మెట్రో రైలు ప్రారంభమై ఆరు నెలలు గడిచినా ఆ దిశగా అడుగులు పడకపోవడంతో రైల్వే ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఆశ్రయిస్తున్నారు.

దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద రైల్వే స్టేషన్‌లలో ఒకటిగా సికింద్రాబాద్‌కు పేరుంది. ఇక్కడి నుంచి దేశ నలుమూలలా రైళ్ల రాకపోకలు నిత్యం జరుగుతుంటాయి. ప్రతిరోజూ లక్షల్లోనే ప్రయాణికులు రైల్వే స్టేషన్‌కు నగర నలుమూలల నుంచి వచ్చి వెళ్తుంటారు. అలాంటి రైల్వేస్టేషన్‌కు సమీపంలోనే ఉన్న మెట్రో స్టేషన్‌తో సరైన అనుసంధానం లేక ప్రయాణికులు ఇతర ప్రయాణ సాధనాలనే వినియోగిస్తున్నారు. మెట్రో ప్రాజెక్టులో భాగంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌తో మెట్రో స్టేషన్‌ను అనుసంధానం చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని మెట్రో అధికారులు లెక్కలు వేశారు. అధికారుల అంచనాలు తప్పా యి. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చే వారు, దూర ప్రాంతాలనుంచి రైళ్లలో వచ్చిన వారు మెట్రోకు దూరంగానే ఉంటున్నారు. కారణం అనుసంధానం లేకపోవడమే. దూర ప్రాంతాలనుంచి రైళ్లు దిగిన తర్వాత లగేజీతో మెట్రో ఎక్కడానికి వెనుకంజ వేస్తున్నారు. దీనికి తోడు నడుచుకుంటూ మెట్రోస్టేషన్‌ వరకు వెళ్లేందుకు అనుకూలంగా ఏర్పాట్లు సైతం చేయకపోవడంతో ప్రయాణికులు మెట్రో కన్నా ఆర్టీసీ బస్సులు, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. చాలా పరిమిత సంఖ్యలోనే మెట్రోస్టేషన్‌ వరకు వస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రయాణికుల అవసరాలను గుర్తించకపోడమేనని రవాణా నిపుణులు పేర్కొంటున్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వేస్టేషన్‌ నుంచి మెట్రోస్టేషన్‌ వరకు స్కైవేలను ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇప్పటికీ ఆ ప్రక్రియ మొదలే పెట్టలేదు.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో దిగిన ప్రయాణికులు మియాపూర్‌, నాగోల్‌ వైపు వెళ్లేందుకు ప్రతి 8నిమిషాలకు ఒక మెట్రో రైలు అందుబాటులో ఉంటోంది. అలాంటి పరిస్థితుల్లో ఈ రెండు మార్గాల్లో ప్రయాణికులు ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా, ఏసీలో ప్రయాణం చేసే అవకాశం ఉంది. అయినా రైల్వే ప్రయాణికులు మాత్రం మెట్రోలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపడం లేదు. దీనికి ప్రధాన కారణం రైలు దిగి స్టేషన్‌ బయటకు వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులు, ఆటోలు, సెట్విన్‌ బస్సులు సమీపంలో ఉండడమే. మెట్రో స్టేషన్‌ సుమారు 250 నుంచి 350 మీట ర్ల దూరంలో ఉండడంతో అంతదూరం లగేజీతో, పిల్లలు, వృద్ధులతో రోడ్డుమీద నడుచుకుంటూ మెట్రోస్టేషన్‌ వరకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు పేర్కొంటున్నారు.

రైలు దిగిన వెంటనే మెట్రోస్టేషన్‌కు వెళ్లేలా స్కై వే లాంటి మార్గాన్ని ఏర్పాటు చేస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్లేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపే అవకాశం ఉంది. కానీ మెట్రో రైలు ప్రారంభమై 6 నెలలు దాటినా స్కైవే ను మాత్రం ఏర్పాటు చేయలేదు. ప్రారంభానికి ముందు రెండు స్టేషన్‌లను అనుసంధానం చేస్తామని చెప్పినా అమలు చేయకపోవడంతో ప్రయాణికులు తమకు సౌకర్యంగా ఆర్టీసీ బస్సులనే ఎక్కువ ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా సికింద్రాబాద్‌ రైల్వే ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో మెట్రో ప్రయాణం చేసేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Leave a Reply