కేసీఆర్‌ బయోపిక్‌ టైటిల్‌ ఫిక్స్‌ చేసిన వర్మ
Spread the love

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’తో రాజకీయవర్గాల్లో వేడి పుట్టించిన సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ.. మరో బయోపిక్‌కు సిద్దమయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ బయోపిక్‌ తెరకెక్కిస్తానని ఇటీవల ప్రకటించిన వర్మ.. అన్నట్లుగానే సినిమాకు టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఘనవిజయం సాధించడంతో మంచి ఊపులో ఉన్న వర్మ.. కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమాన్ని సినిమాగా తెరకెక్కించేపనిలో పడ్డారు. దీనికి సంబంధించి గురువారం ‘ టైగర్ కేసీఆర్‌‌’ సినిమా టైటిల్‌ను ఫిక్స్‌ చేస్తూ.. ది అగ్రెసివ్‌ గాంధీ.. ఆడు తెలంగాణ తెస్తానంటే అందరూ నవ్విండ్రూ’  అని క్యాప్షన్‌గా పేర్కొంటూ ట్వీట్‌ చేశారు.

మరో ట్వీట్‌లో.. ఇది కేటీఆర్‌ తండ్రి బయోపిక్‌.. అని, ఆంధ్రపాలకుల పాలనలో తెలంగాణ ప్రజలు అణచివేతను తట్టుకోని కేసీఆర్‌ ప్రత్యేకరాష్ట్రాన్ని ఏ విధంగా సాధించారో అనే విషయాలను చిత్రంలో చూపించబోతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే తమిళ నాట సంచలనం సృష్టించిన జయలలిత మరణం, అటుపై శశికళ ఉదంతాల నేపథ్యంలో బయోపిక్‌ తెరకెక్కిస్తున్నట్లు తెలిపిన వర్మ.. తాజాగా కేసీఆర్‌ బయోపిక్‌కు శ్రీకారం చుట్టారు. ఓ ఇంటర్వ్యూలో కేసీఆర్ జీవితం ఎంతో నాటకీయంగా ఉంటుందని, ఆయన అనుమతి తీసుకొని బయోపిక్ తీస్తానని వెల్లడించారు. అయితే తాజా ట్వీట్‌లు చూస్తుంటే ఈ బయోపిక్‌కు కేసీఆర్‌ అనుమతి లభించినట్లే తెలుస్తోంది.