శబరిమల వివాదంపై రజనీకాంత్ కామెంట్
Spread the love

కేరళలోని శబరిమల అంశంపై ప్రస్తుతం దేశమంతటా భిన్నాభిప్రాయాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు ఇటీవల శబరిమలకు ఏ వయసులో ఉన్న మహిళలు అయినా వెళ్ళవచ్చు అని తీర్పుని ఇవ్వగా కేరళ ప్రభుత్వం కూడా అదే తరహాలో కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తాం అని వివరణ ఇచ్చింది. అయితే ఈ విషయంపై మొదటిసారి రజినీకాంత్ స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు సమాన హక్కులు ఇవ్వడంలో ఎలాంటి పరిధులు ఉండకూడదు. అయితే ఆలయం విషయానికి వస్తే.. ప్రతి దానికి ఒక్కో తరహాలో విశ్వాసం అలాగే సంప్రదాయాలు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారాలు ఇవి. నా విన్నపం ఏమిటంటే ఇటువంటి వాటిల్లో జోక్యం చేసుకోకూడదని రజినీకాంత్ తెలిపారు. ఇక కోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నారు అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు రజినీ నెమ్మదిగా సమాధానమిచ్చారు. మతం ఆచారాల విషయాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది . కోర్టు తీర్పు అలక్ష్యం చేయమని చెప్పడం లేదు. అలోచించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రజినీకాంత్ తన వివరణ ఇచ్చారు.