గూగుల్‌ ట్రెండ్స్‌లో కాబోయే సీఎం భార్య
Spread the love

రాధిక కుమారస్వామి.. నిన్నమొన్నటి వరకు పెద్దగా తెలియని పేరు. కానీ.. గడిచిన వారం రోజులుగా ఈ పేరు ‘గూగుల్‌ ట్రెండ్స్‌’లో ఉన్నత స్థానంలో నిలుస్తోంది. ఇందుకు కారణం కర్ణాటక ఎన్నికలే. ఆమె రాజకీయాల్లో లేకున్నా.. కాబోయే కర్ణాటక సీఎంకు భార్య కావడంతో.. ఈ గుర్తింపునకు నోచుకుంది. జేడీఎస్‌ నేత హెచ్‌.డి.కుమారస్వామి ఆమెను 2006లో పరిణయమాడారు. వీరిరువురికీ ఇది రెండో పెళ్లి. వీరికి షర్మిలా కుమారస్వామి అనే కూతురు ఉంది. రాధిక ప్రముఖ నటిగా, నిర్మాతగా కన్నడిగులకు సుపరిచితమే. 2010లో దక్షిణ భారత తార, కాంగ్రెస్‌ నాయకురాలు రమ్య, కుమారస్వామిలకు మధ్య ఓ దశలో ఏర్పడ్డ వాగ్యుద్ధంతో.. రాధికకు, కుమారస్వామికి వివాహమైన విషయాన్ని వెలుగులోకి వచ్చింది. కుమారస్వామి దాన్ని బహిరంగంగా అంగీకరించారు.

రాధిక తన 16వ ఏట తెరంగేట్రం చేశారు. వచ్చిన కొత్తలోనే.. శాండల్‌వుడ్‌ను ఒక ఊపు ఊపారు. 2002లో ఆమె నటించిన నీల మేఘ శ్యామ, నినగాగి (నీకోసం), తావరిగె బా తంగీ (పుట్టింటికి రా చెల్లి), ప్రేమఖైదీ, రోమియో జూలియెట్‌ చిత్రాలు విడుదలయ్యాయి. 2006 వరకు ఆమె సినిమాల్లో బిజీ అయిపోయారు. ఏడాదికి కనీసం ఐదుకు తగ్గకుండా సినిమాల్లో నటించారు. 2007లో మూడు చిత్రాలు.. ఆ తర్వాతి కాలంలో.. ఏడాదికి ఒక చిత్రం చొప్పున.. మొత్తం 30 చిత్రాల్లో హీరోయిన్‌గా చేశారు. టాలీవుడ్‌, కోలీవుడ్‌ చిత్రాల్లోనూ ఆమె నటించారు. మే 13 నుంచి మే 19 మధ్య కాలంలో.. ‘రాధిక కుమారస్వామి’ అనే పదం గూగుల్‌ ట్రెండ్స్‌లో టాప్‌ స్థానం లో నిలిచింది. సాధారణంగా.. గూగుల్‌ ట్రెండ్స్‌ భారత్‌లో సెర్చింజన్‌లకు సంబంధించిన 100 పాయింట్స్‌ ఇస్తే.. అది అత్యున్నతమైన సెర్చ్‌ పదం అని అర్థం. ఖతర్‌లో అనూహ్యంగా 36 పాయింట్లు, యూఏఈలో 22, శ్రీలంకలో 19, కువైత్‌లో 18 పాయింట్లు రావడం గమనార్హం.

ఈ రోజు హసన్‌లోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత కుమారస్వామి పూజలు చేశారు. ఐదేళ్లపాటు తన పాలనకు ఎటువంటి అడ్డంకులు ఎదురుకావొద్దని కుమారస్వామి పూజలు చేశారు. కుమారస్వామి నేడు ఢిల్లీకి వెళ్లి కేబినెట్‌పై చర్చలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో పూజలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం ఉదయం 11:30 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కుమారస్వామి సమావేశం కానున్నారు. ఆ తర్వాత 4:30 సమయంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అవుతారు. ఈ భేటీలలో కర్ణాటక మంత్రిమండలి కూర్పుపై ప్రధానంగా  చర్చిస్తారు. ఈ నెల 23న తన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి వారిని కుమారస్వామి ఆహ్వానించనున్నారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి బెంగళూరుకు ప్రయాణం కానున్నారు.