ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన సింధు
Spread the love

ఆసియా క్రీడల్లో తెలుగమ్మాయి పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఏషియన్ గేమ్స్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ చరిత్రలో మొట్టమొదటిసారి ఫైనల్స్ చేరుకున్న క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. ఇప్పటి వరకూ ఆసియా క్రీడల్లో మహిళల, పురుషుల సింగిల్స్‌లో ఫైనల్‌ చేరిన వారు లేరు. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌ చరిత్రలో భారత్‌కు ఇప్పటి వరకూ ఒకే ఒక్క సింగిల్స్‌ పతకం ఉంది. 1982లో దిల్లీలో నిర్వహించిన ఆసియా క్రీడల్లో పురుషుల సింగిల్స్‌లో సయ్యద్‌ మోదీ కాంస్యం గెలిచాడు. ఆ తర్వాత సింగిల్స్‌లో భారత్‌కు ఒక్క పతకం కూడా రాలేదు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ పీవీ సింధు 21-17, 15-21, 21-10 తేడాతో వరల్డ్‌ నంబర్‌ టూ యామగూచి(జపాన్‌)పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. ఫలితంగా రజత పతకాన్ని ఖాయం చేసుకున్న సింధు.. స్వర్ణ పతక పోరుకు సిద్ధమైంది. తొలి గేమ్‌లో పోరాడి గెలిచిన సింధు.. రెండో గేమ్‌ను కోల్పోయింది. దీంతో నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు అద్భుతంగా పోరాడింది. ఎందుకంటే..సింధు ఫిట్‌నెసే ఈ గేమ్‌ను గెలిపించిందని చెప్పొచ్చు. ప్రత్యర్థి యమగూచి అప్పటికే తన ఒంట్లో శక్తినంతా కోల్పోయింది. కానీ, సింధు ఏమాత్రం అలసిపోకుండా బలమైన షాట్లు కొడుతూ 21-10తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుని ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరో సెమీఫైనల్స్ మ్యాచ్ లో తైజూ ఇంగ్ చేతిలో మరో భారతీయ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ 17-21, 14-21 తేడాతో ఓడిపోయి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.