ప్రణబ్‌ ముఖర్జీనే కాబోయే ప్రధానమంత్రి నిజమేనా?
Spread the love

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ గత యాభై ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీనే అట్టిపెట్టుకుని ఉన్నా ఇప్పుడు ఆ ఛాయలకు దూరంగా వ్యక్తిగత గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తున్నారా? కాంగ్రెసేతర, భాజపాయేతర పార్టీల నేతల్ని ఒక్కతాటిపైకి తీసుకువచ్చి, 2019 ఎన్నికల్లోగా ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయడంలో 82 ఏళ్ల ప్రణబ్‌ కీలక పాత్ర పోషించనున్నారా? తాజా పరిణామాలపై పార్టీలకు అతీతంగా పలువురు నేతలతో మాట్లాడినప్పుడు ఈ విషయాలు నిజమేనని అనిపిస్తున్నట్లు ‘ఎన్‌డీటీవీ’ వెల్లడించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ప్రధానమంత్రి అభ్యర్థి అయ్యే అవకాశాలూ లేకపోలేదని వీరిలో కొందరు నేతలు చెప్పారని తెలిపింది.

రాష్ట్రపతి పదవి నుంచి విరమణ చేసినప్పటికీ తానింకా క్రియాశీల రాజకీయాలకు దూరం కాలేదని ప్రణబ్‌ ముఖర్జీ దీని ద్వారా సందేశం ఇచ్చారు. ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో కీలక నేతగా వ్యవహరించిన ప్రణబ్‌ ముఖర్జీ ట్విటర్‌లో తననుతాను సిటిజన్‌ ముఖర్జీగా ప్రస్తావించుకుంటారు. తద్వారా తాను ‘స్వతంత్ర’ పౌరుడిననే సందేశాన్ని ఇస్తారు. ఈ సంకేతాలకు అనుగుణంగానే ఆయన తాజా చర్యలు ఉంటున్నట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గత జనవరిలో బిజూపట్నాయక్‌ జీవితచరిత్ర ఆవిష్కరణ సందర్భంగా.. భువనేశ్వర్‌లో ఒడిసా ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్‌ నవీన్‌ పట్నాయక్‌తో ప్రణబ్‌ ఒక విందు సమావేశం జరిపారు. సోనియాగాంధీ, శరద్‌ పవార్‌ ఇచ్చిన విందులాగా మీడియాలో దీనిపై ఎక్కడా హడావుడి జరగలేదు. అయితే, ఈ సమావేశానికి దేవెగౌడ, సీతారాం ఏచూరి, ఎల్‌కే ఆడ్వాణీ తదితరులు హాజరయ్యారు. పేరుకిది బిజూపట్నాయక్‌ జీవితచరిత్ర ఆవిష్కరణ సమావేశమే అయినా నిజానికి మూడో ఫ్రంట్‌ ఏర్పాటుకు సంబంధించిన కీలక సందర్భం కూడా అని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. దానికి కొద్దినెలల ముందు ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉండగానే.. నవీన్‌ పట్నాయక్‌కు రాష్ట్రపతి భవన్‌లో విందు ఇచ్చారు. అక్కడి నుంచే వారు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీతో ఫోన్‌లో సంభాషణలు జరిపారు. బెంగాల్‌ వాస్తవ్యులైన దాదాకు, దీదీకి మధ్య ఆది నుంచీ సత్సంబంధాలున్నాయి.

ప్రధాని కావాలన్న తన ఆశలను ప్రణబ్‌ ఏనాడూ పెద్దగా దాచుకోలేదు. ‘‘భారత్‌కు ఆయన ప్రధాని కాని ప్రధాని’’ అని ఢిల్లీ రాజకీయవర్గాల్లో పేరుంది. యూపీఏ ప్రభుత్వానికి ప్రధాని మన్మోహన్‌ అయినప్పటికీ ఆ సంకీర్ణాన్ని కాచివడపోసింది ప్రణబ్‌ముఖర్జీయే. సంకీర్ణ రాజకీయాలపై రాసిన పుస్తకంలో ప్రణబ్‌ ఈ విషయాన్ని ఘనంగా చెప్పుకొన్నారు కూడా. యూపీఏ-2 ఏర్పాటైనప్పుడు సోనియాగాంధీ తనను ప్రధానిని చేస్తారని, మన్మోహన్‌ సింగ్‌ను రాష్ట్రపతి భవన్‌కు పంపిస్తారని ఆశించినట్టు కూడా ప్రణబ్‌ తన పుస్తకంలో పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆయనకు అవకాశం ఇవ్వలేదు. దీంతో రాష్ట్రపతిగా రిటైరైన ఈ తరుణంలో ఆయన మరో ప్రయత్నం చేస్తున్నట్టు కాంగ్రెస్‌, బీజేపీ, తృణమూల్‌, బీజేడీకి సంబంధించిన రాజకీయ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. దేశంలోని అన్ని పార్టీలతో సంబంధాలు, ఆమోద యోగ్యత రెండూ ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశం. అందుకే.. ‘‘ప్రణబ్‌ రాజనీతి దురంధరుడు. మోదీకి సాటి రాగల స్థాయి ఉన్నది ఆయన ఒక్కరికే’’ అని బీజేపీ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు.

2019 ఎన్నికల్లో బీజేపీ లేదా ఎన్డీయేకు మెజారిటీ రానిపక్షంలో కీలకపాత్ర పోషించడానికి ప్రణబ్‌ సిద్ధంగా ఉన్నారని ఆ ఎంపీ వివరించారు. బీజేపీ లేదా ఎన్డీయేకు మెజారిటీ రాని పక్షంలో కాంగ్రె్‌సను ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వకూడదని ఆరెస్సెస్‌ పట్టుదలగా ఉంది. మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పాతుకుపోతుందన్నది దాని భయం. అందుకే.. అది ప్రత్యామ్నాయ వ్యూహాల మీద సీరియ్‌సగా దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఏర్పాటయ్యే ఫ్రంట్‌ వెనుక రహస్య అస్త్రమే ప్రణబ్‌ అని ఎన్డీటీవీ వర్గాలు విశ్లేషించాయి. కాగా.. ఆరెస్సెస్‌ సమావేశానికి ప్రణబ్‌ హాజరు కాంగ్రె్‌సకు మింగుడు పడడం లేదు. దీనిపై ప్రశ్నించినప్పుడు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధులు ‘నో కామెంట్‌’ అన్నారు. ప్రణబ్‌ నిర్ణయం కాంగ్రెస్‌ నేతలకు రుచించకపోయినా.. ఆయనను కట్టడి చేసే పరిస్థితి లేదు. కాంగ్రె్‌సకు మద్దతుగా ఉన్నా ప్రధానమంత్రి పదవి ప్రణబ్‌కు దక్కే అవకాశం లేదు. ఎందుకంటే రాహుల్‌ ఇప్పటికే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకున్నారు.

తమ సమావేశానికి ప్రణబ్‌ రావడాన్ని ఆరెస్సెస్‌ వర్గాలు ఘనవిజయంగా చెప్పుకొంటున్నాయి. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ అయితే.. సంఘ్‌ పట్ల ఇన్నాళ్లూ ఉన్న రాజకీయ అంటరానితనానికి ప్రణబ్‌ చరమగీతం పాడారని వ్యాఖ్యానించారు. కాగా.. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరిట తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఇటీవల మమతా బెనర్జీ భేటీ అయిన విషయం తెలిసిందే. వారి వెనక సూత్రధారి ప్రణబ్‌ అని బీజేపీ సీనియర్‌ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. మమత ఏం చేసినా అది ప్రణబ్‌ కనుసన్నల్లోనేనని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే ఐదేళ్లపాటు భారతదేశ భవిష్యత్తును నిర్దేశించే ఫ్రంట్‌కు వీరు రూపకల్పన చేయాలని అనుకుంటున్నారని తెలిపారు.