‘జనసేన’ మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ విడుదల..!
Spread the love

జనసేన పార్టీ మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ ను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు విడుదల చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని మావుళ్లమ్మ అమ్మ వారిని దర్శిచుకున్నారు. అనంతరం విజన్ డాక్యుమెంట్ ను ఆయన విడుదల చేశారు. ఈ మేరకు ‘జనసేన’ ట్విట్టర్ లో ఈ విజన్ డాక్యుమెంట్ ను పొందుపరిచారు. మేనిఫెస్టోలోని కొన్ని మచ్చుతునకలంటూ 12 హామీలతో పాటు 7 సిద్ధాంతాలను పొందు పర్చారు.

తాము అధికారంలోకి వస్తే మహిళలకు 33శాతం రాజకీయ రిజర్వేషన్లు, ఉచితంగా వంట గ్యాస్‌ సిలిండర్లు అందజేస్తామని అన్నారు. రేషన్‌కు బదులు మహిళల ఖాతాల్లో రూ.2500-3500 వరకు నగదు జమ, బీసీలకు అవకాశాన్ని బట్టి రాజకీయంగా 5 శాతానికి రిజర్వేషన్ల పెంపు, చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు, కాపులకు 9వ షెడ్యూల్‌ ద్వారా రిజర్వేషన్ల కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి కార్పొరేషన్‌ ఏర్పాటు, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల విద్యార్థులకు వసతిగృహాలు, ముస్లింల అభివృద్ధికి సచార్‌ కమిటీ విధానాలు అమలు చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ విధానం రద్దుచేసి, వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలను ఏర్పాటు చేయనున్నట్టు మేనిఫెస్టోలో స్పష్టం చేశారు.