జనసేనాని పవన్ కళ్యాణ్‌కి గుడ్ న్యూస్
Spread the love

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. గెలుపుపై టీడీపీ, వైసీపీలు కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. గెలిచేది మేమే అని ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. తొలిసారి ఏపీ ఎన్నికల బరిలోకి దిగిన జనసేన గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆఖరికి పవన్ కళ్యాణ్ కూడా సైలెంట్ గానే ఉన్నారు. దీనికి కారణం జనసేన ప్రభావం పెద్దగా ఉండకపోవడమే. జనసేనకు రెండు మూడు సీట్లు వచ్చినా గొప్పే అనే టాక్ నడుస్తోంది. అధికారంలోకి వస్తే గిస్తే టీడీపీ లేదా వైసీపీ అని జనాలు కూడా గట్టిగా నమ్ముతున్నారు. కాబోయే సీఎం చంద్రబాబు లేదా జగన్ అని మెంటల్ గా ఫిక్స్ అయ్యారు.

 

ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ, మాజీ మంత్రి, సీనియర్ రాజకీయవేత్త హరిరామజోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఫలితాలు ఎలా ఉంటాయి, ఎవరు కింగ్ మేకర్ అవుతారు, సీఎంగా ఎవరికి అవకాశాలు ఉన్నాయనే అంశాల గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలకు పూర్తి మెజారిటీ రాదన్నారు. ఆ రెండు పార్టీలు మేజిక్ ఫిగర్ అందుకునే చాన్స్ లేదన్నారు. ఈ క్రమంలో జనసేనకు వచ్చే సీట్లే ఏపీ సీఎంని డిసైడ్ చేస్తాయని హరిరామజోగయ్య జోస్యం చెప్పారు

Related image

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ రాష్ట్ర రాజకీయాలను శాసించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. పవన్ కింగ్ లేదా కింగ్ మేకర్ అవ్వడం ఖాయమన్నారు. పోలింగ్ ట్రెండ్ చూస్తుంటే టీడీపీ, వైసీపీలలో ఎవరికీ మెజారిటీ రాకపోవచ్చన్నారు. జనసేనకు కనీసం 20 స్థానాలు వస్తాయని చెప్పారు. అప్పుడు టీడీపీ, వైసీపీలకు మ్యాజిక్ ఫిగర్ అందుకోవడం కష్టమవుతుందని అంచనా వేశారు. 90 సీట్లు ఏ పార్టీకి రావని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడాలంటే పవన్ కళ్యాణ్ నిర్ణయమే కీలకం అవుతుందని అన్నారు. జనసేన పార్టీకి ఈ ఎన్నికల్లో 20 స్థానాల వరకు రావొచ్చని, దాంతో పవన్ సీఎం అన్నా కావాలి, లేకపోతే సీఎంను నిర్ణయించే కింగ్ మేకర్ అన్నా కావాలి అని పేర్కొన్నారు. పాలకొల్లులో మీడియాతో మట్లాడిన హరిరామజోగయ్య ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కింగ్ లేకా కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ ఉందని హరిరామజోగయ్య చెప్పిన జోస్యం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

 

గతంలోనూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పసుపు-కుంకుమ పథకం వల్ల వచ్చే లాభం కంటే జనసేన వల్ల టీడీపీకి కలిగే నష్టమే ఎక్కువగా ఉంటుందని జోగయ్య అభిప్రాయపడ్డారు. వైసీపీ ఈ ఐదేళ్లలో గత ఎన్నికల కంటే కొత్త వర్గాలను ఆకర్షించలేకపోయిందని అన్నారు. బీఎస్పీ జనసేనతో పొత్తు పెట్టుకున్న కారణంగా దళితుల ఓట్లలో చీలిక వచ్చిందని.. ఈ పరిణామం వైసీపీకి నష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

 

ఉభయగోదావరి జిల్లాలో జనసేన ప్రభావం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉందని.. ఇప్పటికే టీడీపీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి మాగంటి రూప చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో అనూహ్యంగా జనసేన పై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు హరిరామజోగయ్య జోస్యం. ఇవన్నీ చూస్తుంటే.. జనసేన కీ రోల్ ప్లే చెయ్యడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు జనసేన శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతున్నాయి. మరి ఎవరి జోస్యం నిజం అవుతుందో, జనసేన ఏ మేరకు ప్రభావం చూపుతుందో తెలియాలంటే మే 23వ తేదీ వరకు ఆగాల్సిందే.