యనమల బ్రదర్స్ మైనింగ్ మాఫియా నడిపిస్తున్నారు : పవన్ కళ్యాణ్
Spread the love

ఆంధ్రప్రదేశ్ లో మైనింగ్ పేరుతో అక్రమార్కులు వేలకోట్లు దోచుకుంటుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పోరాటయాత్రలో భాగంగా వంతాడ లాటరైట్ మైనింగ్ ప్రాంతాన్ని పవన్ కల్యాణ్ పరిశీలించారు. వంతాడ రచ్చబండ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. సముద్ర మట్టానికి 860 అడుగుల ఎత్తులో ఉండే వంతాడ గ్రామానికి భారీ భద్రత మధ్య చేరుకున్న పవన్ కల్యాణ్ గిరిజనులతో సమావేశమై లాటరైట్ మైనింగ్ పరిస్థితులను పరిశీలించారు. పవన్ కల్యాణ్ అధికారిక ఫేస్ బుక్ పేజ్ నుంచి లైవ్‌లో మాట్లాడిన జనసేనాని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మైనింగ్ జరుగుతుంటే గిరిజనులకు స్థానికులకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. సహజ సంపదను దోచుకుంటుంటే కళ్లప్పగించి చూస్తారా? ఇదేనా రియల్ టైమ్ గవర్నెన్స్ అంటే అంటూ చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇదే పారదర్శకత అంటూ ప్రశ్నించిన పవన్ కల్యాణ్. మైనింగ్‌ను ప్రైవేట్‌పరం చేయడానికి ప్రభుత్వానికి సిగ్గుండాలన్నారు.

ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని లేటరైట్ కొండలను పిండి చేస్తున్నారని.. ఖనిజ సంపదను యథేచ్ఛగా దోచుకుంటున్నారని మంత్రి యనమల సోదరుడు కృష్ణుడు వందల కోట్లు వెనకేసుకున్నారని పవన్‌కల్యాణ్ ధ్వజమెత్తారు. వంతాడ క్వారీలో తవ్విన ఖనిజాన్ని రావికంపాడు రైల్వే డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారని దీనివల్ల అక్కడ ప్రజలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నారని.. దీనిపై ప్రశ్నించిన యువతను యనమల కృష్ణుడు బెదిరిస్తున్నారని ఆరోపించారు. వియ్యంకుడికి పోలవరం కాంట్రాక్టు ఇప్పించడంలో ఉన్న ఉత్సాహాన్ని మంత్రి యనమల రావికంపాడులో కాలుష్య నివారణపై ఎందుకు చూపించట్లేదని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు దారితీసే రహదారి బీటలు వారడంపైనా పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్న చంద్రబాబు రియల్ టైమ్ గవర్నెన్స్ పోలవరం రోడ్డు ఘటనపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. “కిలోమీటర్ మేరకు ఇంత దారుణంగా రోడ్డు దెబ్బతినడాన్ని రియల్ టైమ్ గవర్నెన్స్ టీమ్ గ్రహించిందా? కారణాలేంటో చెప్తారా? కొంపతీసి పోలవరం ప్రాంతంలో భూకంపం వచ్చిందంటారా? ప్రజలను అయోమయంలో పడేయకుండా.. కొంచెం క్లారిటీ ఇవ్వండి” అని ఆయన తెలియజేసారు.