
రూ. 5 వేల కోట్ల ప్రత్యేక నిధితో పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యవసాయ అభివృద్దికి చర్యలు తీసుకుంటామని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్‌కళ్యాణ్ గారు మాటిచ్చారు. వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి మార్కెటింగ్ సౌకర్యం, నిల్వచేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్‌లు నిర్మిస్తామన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుతామని తెలిపారు. నిరుపయోగంగా ఉన్న లక్ష ఎకరాల భూమిని సేకరించి లక్ష మంది యువ రైతుల్ని తయారు చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిడదవోలులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
ప్రజలను ఉద్దేశించి శ్రీ పవన్‌కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “గతంలో నిడదవోలు మీటింగ్‌కి వచ్చినప్పుడు వర్షం కురుస్తూ ఉంది. అంత వర్షంలో ఓ పెద్దావిడ పక్కకి వచ్చి గడ్డం పట్టుకున్నప్పుడు.. గూడు, తోడు లేని ఆ తల్లిని చూసి పెద్దలకు ఆదరణ నిలయాలు పెట్టాలని నిర్ణయించుకున్నా. పేరుకి నిడదవోలు రైల్వే జంక్షన్ ఉన్నా, అవసరమైన రైళ్లు ఆగవు. ఎమ్మెల్యే, ఎంపీ ఏం చేస్తున్నారో తెలియదు. రైలు ఆగాలంటే పార్లమెంటులో మాట్లాడాలి. రాజమండ్రి ఎంపిగా డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారిని గెలిపిస్తే మన గొంతు పార్లమెంటులో వినిపిస్తారు. యువత కోసం ప్రతి మండలంలో పదెకరాల్లో ఒక దేశభక్తి ప్రాంగణం నిర్మిస్తాం. దేశం కోసం త్యాగాలు చేసిన వారు, సంస్కృతి, సంప్రదాయాలు కాపాడిన వారి పేర్లు ఆ ప్రాంగణాలకు పెడదాం. యువతకు సామాజిక బాధ్యతను నేర్పుదాం. కులాలు, మతాలు, ప్రాంతాలను పక్కకు తీసి మనం మనుషులం అన్న సంగతి అలవాటు చేయకపోతే చంద్రబాబు, జగన్‌లా అభివృద్ధి అంతా ఒక వర్గ పరిమితిలోకి వెళ్లిపోతుంది. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక అతి తక్కువ సమయంలో నిడదవోలులో రైల్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటాం. నిడదవోలు ఆసుపత్రికి డాక్టర్ల సంఖ్య పెంచుతాం. 40 గ్రామాలకు ఉపయోగపడే సమిశ్రగూడెం బ్రిడ్జిని 16 నెలల్లో నిర్మిస్తాం. నియోజకవర్గం అంటే ఒక్క ఎమ్మెల్యే ఊరు మాత్రమే కాదు. తన ఊరికి డ్రైనేజీ వేయించుకుని మిగిలింది వదిలేయడం బాధ్యత అనిపించుకోదు. ఇసుక మాఫియాలో బిజీగా ఉండే వ్యక్తిని కాదు… మన మట్టివాసన తెలిసిన ఆడపడుచుని జనసేన పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది. మద్దతు తెలపండి. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన 16 నుంచి 18 నెలల కాలంలో మంచి నీటి సమస్య తీర్చే బాధ్యతను తీసుకుంటాం. ఆడపడుచుల కోసం ప్రతి కుటుంబానికి ఆదాయంతో సంబంధం లేకుండా జనసేన ప్రభుత్వం పది గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తుంది. ఆడ బిడ్డ ప్రతి ఇంటికి మహాలక్ష్మీ అని, అటువంటి మహాలక్ష్ముల వివాహానికి ‘మా ఇంటి మహాలక్ష్మీ’ పథకం కింద లక్ష రూపాయలు అందిస్తాం. ‘పుట్టింటి సారె’ కింద రూ.పదివేల నూటపదహార్లు ఇస్తాం. వివాహ ఖర్చుల నిమిత్తం అవసరాలకు రూ. 50 వేల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం. రేషన్‌కి బదులు రూ. 2500 నుంచి రూ. 3500 వరకు మహిళల ఖాతాల్లో జమ చేసే పథకాన్ని పెట్టాం. ఇళ్లు లేని వారికి అవకాశం ఉన్నచోట, సొంతంగా ఇల్లు కట్టుకునే స్తోమత ఉన్న వారికి ఇళ్ల పట్టాలు ఇస్తాం. అది వీలు కాని పరిస్థితుల్లో బహుళ అంతస్థుల భవనాలు కట్టించి నివాసం ఏర్పాటు చేస్తాం. 60 సంవత్సరాలు నిండిన రైతులకు రూ. 5 వేల పెన్షన్ ఇస్తాం. ఏడాదికి రూ.8 వేల చొప్పున సాగు సాయం అందిస్తాం. రైతులకు జనసేన ప్రభుత్వంలో ఉచితంగా సోలార్ మోటర్లు అందచేస్తాం. చేనేత కార్మికులకు రూ. 5 వేల పెన్షన్ ఇస్తాం. 58 సంవత్సరాలు నిండిన మత్స్యకారులకు పెన్షన్ సదుపాయం కల్పిస్తాం. చిరు వ్యాపారులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా పది వేల వరకు రుణ సదుపాయం కల్పిస్తాం.
చంద్రబాబు అందుకే ఉద్యోగాలు ఇవ్వరు
చంద్రబాబు గారు ఖాళీగా ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయరో తెలుసా… భర్తీ చేస్తే జన్మభూమి కమిటీల పేరిట తమ పార్టీ గూండాలు దోపిడి చేయడానికి డబ్బు ఉండదు. అందుకే ఉద్యోగాలు ఇవ్వరు. జనసేన ప్రభుత్వంలో సోషలిస్ట్ డెమోక్రాటిక్ వాల్యూస్‌ని కాపాడుతాం. ఆరు నెలల్లో మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయిస్తాం. ముఖ్యమంత్రి గారు ఔట్సోర్సింగ్ పేరుతో ఉద్యోగాలు ఎగ్గొడుతున్నారు. అందువల్ల ఎస్సీ, ఎస్టీలకు దామాషా ప్రకారం దక్కాల్సిన ఉద్యోగాలు రావడం లేదు. జనసేన ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాల అవకాశాలు కల్పిద్దాం. వ్యాపారాలు చేసుకునేందుకు ముందుకు వచ్చే దళిత యువతకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు మంజూరు చేసే ఏర్పాటు చేస్తాం. దారిద్యరేఖకు దిగువన వున్న ముస్లిం కుటుంబాలు ఆర్ధికంగా బలపడేందుకు తక్కువ వడ్డీ రుణాలు ఇప్పిస్తాం. స్మార్ట్ సిటీ స్లమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ముస్లింలకు అన్ని వసతులతో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి ఇస్తాం. రెండు వేల కెపాసిటీ కలిగిన షాదీఖానాలు నిర్మిస్తాం. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరిస్తాం. నాది రెల్లికులం అని గొప్పగా చెప్పగలను . ఆ రెల్లి కులంలో ఆడపడుచులు పని చేసే ప్రదేశాలకు వెళ్లేందుకు వీలుగా స్కూటర్లు ఇస్తాం. వ్యాపారాలు చేసుకునేందుకు రూ. 50 వేల వరకు రుణాలు ఇస్తాం. వయసు మళ్లిన చేనేత కార్మికులకు రూ. 5 వేల వరకు పెన్షన్ సదుపాయం కల్పిస్తాం. గీత కార్మికులకు అండగా ఉండేందుకు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతాం.
జగన్మోహన్ రెడ్డిలా మనుషుల్ని ఓట్ బ్యాంక్ లా చూడను
బీఎస్పీతో కలిస్తే ఓటు బ్యాంకు చీల్చడానికంటూ ప్రచారం చేస్తున్నారు. నేను మీలా తప్పుడు ఆలోచనలు చేయను. ఒకర్ని గెలిపించేందుకు పిచ్చి పనులు చేయను. జగన్మోహన్రెడ్డి గారు పులివెందులలో మాట్లాడుతున్నారు. ఎస్సీ, ఎస్టీలు ఏమైనా మీ గుత్తాధిపత్యమా. నేను మీలా మనుషుల్ని ఓటు బ్యాంకుగా చూడను. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయను. మనుషుల్ని మనుషులుగా, ప్రేమగా చూస్తాను. 2008లోనే తెలంగాణకు చెందిన కొందరు దళిత మేధావులు నన్ను బీఎస్పీలోకి ఆహ్వానించారు. ఆ పార్టీకి నాయకత్వం వహించమన్నారు. అబద్దపు ఆరోపణలు చేసే ముందు నాటి పేపర్లు ఒకసారి తిరగేసి చూసుకోండి. వైసీపీ, టీడీపీలు ఇకనైనా పిచ్చి వాగుడు ఆపాలి. నేను అన్ని వర్గాలు బాగుండాలని కోరుకునే వ్యక్తిని. దేశభక్తి కలవాడని. దేశభక్తి అంటే సమాజంలో ఉన్న అసమానతలు సరిచేయడం కానీ, ప్రజల్ని కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విడగొట్టడం కాదు. నేను భావితరాల కోసం జనసేన పార్టీని పెట్టాను.
రాయలసీమకు వెళ్లాలంటే అడ్డంకులు సృష్టించారు
నేను ఎప్పుడో చెప్పాను 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతోగానీ, వైసీపీతోగానీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని. ఒంటరిగా ఎన్నికలకు వెళ్తున్నామని. ఆ రోజు వైసీపీ నాయకులు జనసేన మాతో వస్తుంది అంటే, ఈ రోజు టీడీపీ నాయకులు వాళ్లతో ఉన్నామని అంటున్నారు. రాజకీయాల్లో మార్పు కోసం, సరికొత్త తరం కోసం పార్టీ వస్తే, ఆ పార్టీకి అండగా ఉన్న తరాన్ని గందరగోళానికి గురిచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నిడదవోలు నుంచి టీడీపీ, వైసీపీ నాయకులకు చెబుతున్నా, తప్పుడు ప్రచారాలు, పిచ్చి ప్రచారాలు మానుకోండి. 2014లో బీజేపీ, టీడీపీలతో కలసి వెళ్లినప్పుడు అందరికీ చెప్పే చేశా. ఏ నిర్ణయం తీసుకున్నా ధైర్యంగా బయటికి చెబుతా. జగన్మోహన్రెడ్డి గారిలా దొడ్డిదారి పనులు చేయను. టీడీపీతో వెళ్లడానికి ఆ పార్టీ ఏమైనా నీతి, నిజాయితీలతో కూడిన పార్టీనా.? అవినీతితో నిండిపోయిన పార్టీ. పోరాట యాత్రలో ఆ పార్టీ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాల మీద పోరాటం చేసి ఇప్పుడు మద్దతు ఎలా పలుకుతాం.? ఇరువురి బాధ నేను ఇప్పుడు వారితో లేననే. రాజకీయాలు మీరే చేయాలా, ఇంకా ఎవరికీ చేతకావా.? వీరి కుటుంబాలకు మాత్రమే పొలిటికల్ డిఎన్ఎ ఉందా. వారు పాలించే వారు, మనం పాలింపబడే వాళ్లం. మధ్యలో ఎవరైనా వస్తే ఇలా ఇబ్బందులు పెడతారు. రాయలసీమ వెళ్లే హెలీకాప్టర్కి అనుమతి ఇవ్వకుండా వైసీపీ వారు ఇబ్బంది పెట్టారు. శ్రీకాకుళం వెళ్దాం అంటే టీడీపీ వారు అడ్డుకున్నారు. ఇద్దరితో పోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే సైకిల్ చైన్ తెగిపోయింది. ఫ్యాన్‌కి పవర్ తీసేశాం. జనసేన పార్టీ ఎవరి పార్టనర్ కాదు. నా కోసం వచ్చిన ఆడపడుచులకు, అన్నదమ్ములకు మాత్రమే పార్టనర్” అని తెలిపారు.