ఎన్టీఆర్ బయోపిక్ ప్రమాణస్వీకారం రోజునే…
Spread the love

ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాలలో క్రేజీ ప్రాజెక్ట్‌లు గా చెప్పుకుంటున్న బయోపిక్‌ల‌లో ఎన్టీఆర్ ఒక‌టి. నందమూరి తారకరామారావు జీవిత నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతుంద‌ని ముందుగా ‌ప్రక‌టించిన‌, ఆ త‌ర్వాత ఈ ప్రాజెక్ట్ బాల‌య్య వందో చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి తెరెక‌క్కించిన క్రిష్ చేతికి వెళ్లింది. ప్ర‌స్తుతం ఆయ‌న స్క్రీన్‌ప్లేని మార్చుకొని రెగ్యుల‌ర్ షూటింగ్‌కి స‌న్నాహాలు చేసుకుంటున్నాడు.

ఎన్టీఆర్ బ‌యోపిక్ లాంచ్ అయి చాలా రోజులే కావొస్తున్నా మూవీ సెట్స్ పైకి వెళ్ళ‌క‌పోయే స‌రికి అభిమానుల‌లో ప‌లు అనుమానాలు త‌లెత్తుతున్నాయి. సంక్రాంతికి ఈ సినిమా విడుద‌ల అవుతుందని బాలయ్య ముందుగానే ప్ర‌క‌టించ‌డంతో సినిమా చిత్రీక‌ర‌ణ ఎప్పుడు మొద‌లు అవుతుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ వ‌చ్చారు. ఈ మేర‌కు జూలై 5న షూటింగ్ మొద‌లు పెట్ట‌నున్న‌ట్టు తెలుస్తుంది.

తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో ప్రజల మధ్యకి వెళ్లిన ఎన్టీఆర్‌… తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొలిసారి జనవరి 9న ప్రమాణస్వీకారం చేశారు. ఎన్టీఆర్‌ జీవితంలో ఆ రోజు ఎంతో ప్రాముఖ్యమైనది కాబట్టి… ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రాన్ని అదే రోజునే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. ఎన్టీఆర్‌ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తూ,నిర్మిస్తున్న చిత్రమిది. హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైన ఈ చిత్రం, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే విడుదల చేయనుండడం విశేషం. బాలకృష్ణకి అచ్చొచ్చిన సంక్రాంతి కూడా ఈ చిత్రానికి కలిసొస్తోంది. బాలకృష్ణ, క్రిష్‌ కలయికలో తెరకెక్కిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కూడా సంక్రాంతి సందర్భంగానే విడుదలై విజయం సాధించింది.