ఎన్టీఆర్‌  ఫస్ట్‌లుక్‌ అదిరింది…!
Spread the love

ఎన్టీఆర్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఆయన కథానాయకుడిగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. పూజా హెగ్డే కథానాయిక. తమన్‌ బాణీలు అందిస్తున్నారు. ఆదివారం తారక్‌ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. సినిమా టైటిల్‌తోపాటు తారక్‌ లుక్‌ను ప్రేక్షకులకు చూపించారు. ‘అరవింద సమేత.. వీర రాఘవ’ అనే టైటిల్‌ను ఈ సినిమాకు ఖరారు చేశారు. ‘వీర రాఘవ’ అనేది ఉపశీర్షిక.

ఈ తొలి ప్రచార చిత్రంలో తారక్‌ సిక్స్‌ప్యాక్‌‌లో ఫిట్‌గా కనిపించారు. చేతిలో కత్తి.. ప్యాంటుకు రక్తం మరకలు చూస్తుంటే సినిమాలో యాక్షన్స్‌ సన్నివేశాలకు బాగా చోటున్నట్లు అర్థమవుతోంది. ఇక ఈ టైటిల్ సాఫ్ట్‌గా ఉన్నప్పటికీ, పోస్టర్‌లో మాత్రం ఎన్టీఆర్ నుంచి ప్రేక్షకులు ఏం కావాలని కోరుకుంటారో.. అంతకంటే ఎక్కువగా ఇచ్చేశాడు త్రివిక్రమ్. ఇక ఎన్టీఆర్ లుక్ గురించి ఏం చెప్పాలి? నెవర్ బిఫోర్ అన్నట్లే ఉంది. ఇంతకముందు ‘టెంపర్’ సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించాడు. కానీ.. ఇప్పుడు మరింత పర్ఫెక్టుగా ఉంది . ఈ లుక్ నిజంగా ఫ్యాన్స్‌కి పండగే. ఎన్టీఆర్ బర్త్‌డేకి త్రివిక్రమ్ ఇచ్చిన ట్రీట్ అదిరిపోయిందంటూ.. అప్పుడే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్వీట్ల వర్షం కూడా స్టార్ట్ చేశారు

ఈ సినిమాలో తారక్‌ చిత్తూరు యువకుడిగా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ నేపథ్యానికి తగ్గట్టు తారక్‌ లుక్‌ ఉంది.‘జై లవకుశ’ హిట్‌ తర్వాత తారక్‌ నటిస్తున్న చిత్రమిది. దీని తర్వాత ఆయన ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు. మల్టీస్టారర్‌గా తెరకెక్కించనున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ మరో కథానాయకుడు. ఈ ఏడాదిలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.