సావిత్రిగా నిత్యామీనన్ ఫస్ట్ లుక్!
Spread the love

తెలుగువారి కీర్తిని, ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేసిన నందమూరి తారక రామారావు జీవిత కథను ‘ఎన్టీఆర్‌’ పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘కథానాయకుడు’, ‘మహా నాయకుడు’ పేర్లతో రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్‌గా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకుడు. తాజాగా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మహానటి సావిత్రి పాత్రలో నటిస్తున్న నిత్యామీనన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ కోసం నిత్యామీనన్ సావిత్రిలా మారిపోయినట్లు కనిపిస్తోంది. కళ్ళతోనే హావభావాలు పలికించగల నటి సావిత్రి. ఆ కితాబు నిత్యామీనన్ కు కూడా ఉంది. దీనితో ఎన్టీఆర్ గా బాలయ్య, సావిత్రిగా నిత్యామీనన్ మధ్య వచ్చే సన్నివేశాలు అభిమానులకు కన్నుల పండుగే. గుండమ్మ కథ, మాయబజార్, మిస్సమ్మ, నర్తనశాల వంటి అద్భుత చిత్రాల్లో ఎన్టీఆర్, సావిత్రి కలసి నటించారు. తాజాగా నిత్యామీనన్ ఫస్ట్ లుక్ ఎన్టీఆర్, ఏఎన్నార్ గుండమ్మ కథ చిత్రంలోనిది. ఆ చిత్రంలోని లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అనే సూపర్ హిట్ సాంగ్ కి సంబందించినది ఈ స్టిల్. ఎన్టీఆర్ పాత్రలో ఉన్న బాలయ్య పిండి రుబ్బుతుండగా సావిత్రి నిలుచుని చూస్తూ ఉంది. ఈ ఫస్ట్ లుక్ ని నిత్యామీనన్ ట్విట్టర్ లో విడుదల చేసింది. సావిత్రి అమ్మగా నేను నటిస్తుండడం గర్వంగా ఉంది అంటూ నిత్యామీనన్ పేర్కొంది.