
భారీ వర్షాలకు కేరళ అతలాకుతలమయ్యింది. రాష్ట్రమంతా భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ వరదల కారణంగా 300మందికిపైగా మృత్యువాతపడ్డారు. చాలా మంది నిరాశ్రయులయ్యారు. మరికొందరికీ కనీసం ఇంటి నుంచి కాలు తీసి బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి. ఇళ్ల పైకప్పులు, కొండ ప్రాంతాలు, ఇతర మారుమూల ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్, సైనిక బృందాలు కాపాడుతున్నాయి. పడవలు వెళ్లే వీలులేని ప్రాంతాల నుంచి ప్రజలను హెలికాప్లర్ల ద్వారా బయటికి తీసుకొస్తున్నారు. అలాంటి సమయంలో ఓ గర్భిణి మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆ సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వారి ప్రతిభను కనపరిచారు. ఆమెను సురక్షితంగా కాపాడగలిగారు.
కోచి ప్రాంతానికి చెందిన సజిత అనే గర్భిణికి శుక్రవారం మధ్యాహ్నం పురిటినొప్పులు తీవ్రమయ్యాయి. కనుచూపు మేరలో అంతా నీటిమయం కావడంతో ఆమెలో ఆందోళన మొదలైంది. స్థానిక అధికారులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగారు. హెలికాప్టర్ సాయంతో ఆమెను కాపాడి సురక్షితంగా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
సజితను తాడు సాయంతో సురక్షితంగా హెలికాప్టర్లోకి చేరుస్తున్న వీడియో వైరల్ అయింది. గాల్లో చాలాసేపు ప్రమాదకరంగా వేలాడటంతో ఆమె ఉమ్మనీటి సంచి పగిలింది. వెంటనే ఆ మహిళను నేవీ ఆసుపత్రికి తరలించగా మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. అంతకుముందు ఆందోళనకు గురైన సజితకు వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి ధైర్యం నూరిపోశారు. ప్రతికూల వాతావరణంలోనూ పైలట్ విజయ్ వర్మ హెలికాప్టర్‌ను చాకచక్యంగా నడిపారు. ఆమె ప్రాణాలు కాపాడటాన్ని ఎయిర్‌ఫోర్స్ అధికారులు సవాలుగా తీసుకున్నారు. ఈ కారణంగానే సజిత ప్రాణాలు దక్కాయి. ఇండియన్ నేవీకి చెందిన ‘చేతన్’ బృందం కేవలం అర గంటలో ఈ ఆపరేషన్‌ను పూర్తిచేసింది ఆస్పత్రిలో చేర్పించిన కొద్ది సేపటికే బిడ్డకు జన్మనిచ్చారు.
A pregnant lady with water bag leaking has been airlifted and evacuated to Sanjivani. Doctor was lowered to assess the lady. Operation successful #OpMadad #KeralaFloodRelief #KeralaFloods2018 pic.twitter.com/bycGXEBV8q
— SpokespersonNavy (@indiannavy) August 17, 2018