కొడుక్కి సారీ చెప్పిన నాని!
Spread the love

నేచురల్ స్టార్ నాని హీరోగా మళ్ళీరావా ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా జెర్సీ. క్రికెట్ నేపథ్యంలో పిరియాడిక్‌ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌ ట్రైలర్‌లకు మంచి స్పందన రావటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక నాని కూడా సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేసే పనిలో పడ్డాడు. సరదా ట్వీట్లతో అభిమానులను ఆకర్షిస్తున్నాడు. తాజాగా తన ముద్దుల కుమారుడికి సారీ చెబుతూ ఓ ఫొటోతో కూడిన పోస్ట్‌ను పంచుకున్నాడు.

ఈ ఫొటోలో నాని కుమారుడు ‘మా డాడీ నా పేరు దొంగలించాడు’ అని రాసి ఉన్న టీషర్ట్‌ వేసుకోగా.. ఆ పక్కనే కూర్చున్న నాని టీషర్టుపై అర్జున్‌ 36 అని ఉంది. ఈ ఫొటోకు ‘సారీ రా.. జున్ను తప్పలేదు’ అని  క్యాఫ్షన్‌గా పేర్కొన్నాడు. జెర్సీ చిత్రంలో నాని.. అర్జున్‌ అనే  36 ఏళ్ల క్రికెటర్‌ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తన కొడుకు పేరు కూడా అర్జునే కావడంతో.. అతని పేరు దొంగలించక తప్పలేదు.. సారీ రా అంటూ సరదగా ట్వీట్‌ చేశాడు. ఎమోషనల్‌ పిరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో సాండల్‌వుడ్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్‌ టాలీవుడ్‌కు పరిచయం అవుతుండగా.. తమిళ సంగీత సంచలనం అనిరుధ్ స్వరాలందిస్తున్నాడు.