ఆనంద్ లవ్ ప్రపోజల్‌కు ఓకే చెప్పేసిన ఈశా అంబానీ
Spread the love

ఇటీవలే కుమారుడి నిశ్చితార్థం జరిపించిన భారత కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీ ఇంట మరో శుభకార్యం త్వరలోనే జరగనుంది. ఆయన కుమార్తె ఈశా అంబానీ దేశ దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరైన పిరమాల్‌ సంస్థల వారసుడు ఆనంద్‌ పిరమాల్‌ను వివాహం చేసుకోనున్నారు.

ఈ రెండు కుటుంబాల మధ్య 40 ఏళ్లుగా చక్కటి స్నేహబంధం కొనసాగుతోంది. ఈశా, ఆనంద్‌ల మధ్య కూడా గాఢమైన స్నేహం ఉంది. ఇటీవలే ఈశా కవల సోదరుడు ఆకాశ్‌కు వజ్రాల వ్యాపార దిగ్గజం రస్సెల్‌ మెహతా కుమార్తె శ్లోకతో వివాహం నిశ్చయమైన విషయం గమనార్హం. ఆకాశ్‌, శ్లోకల వివాహం లాగే….ఆనంద్‌, ఈశాల వివాహం కూడా డిసెంబరులోనే జరగవచ్చని తెలుస్తోంది.

ఈషా, ఆనంద్‌ చాలాకాలంగా మంచి స్నేహితులు. ఆనంద్‌ పిరమల్‌ ఇటీవలే మహాబలేశ్వర్‌లో ఒక గుడి దగ్గర ఈషాకు ప్రపోజ్‌ చేశారు. ఆమె ఒప్పుకోవడం.. ఇరువైపులా పెద్దలకు తెలియజేయడం.. వాళ్లూ అంగీకరించడం వేగంగా జరిగిపోయాయి.

పెన్సిల్వేనియా వర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్‌, హార్వర్డ్‌ వర్సిటీలో ఎంబీయే చేసిన ఆనంద్‌ పిరమల్‌ ప్రస్తుతం పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘పిరమల్‌ రియల్టీ’ పేరుతో ఒక రియల్‌ ఎస్టేట్‌ కంపెనీని స్థాపించారు. ‘పిరమల్‌ స్వాస్థ్య’ పేరుతో గ్రామీణ ఆరోగ్య సంరక్షణ సంస్థను స్థాపించి, రోజుకు 40 వేల మంది రోగులకు చికిత్సనందిస్తున్నారు. ఇక, యేల్‌ యూనివర్సిటీ నుంచి ‘సైకాలజీ అండ్‌ సౌత్‌ ఏషియన్‌ స్టడీస్‌’లో పట్టభద్రురాలైన ఈషా.. రిలయన్స్‌ జియో, రిలయన్స్‌ రిటైల్‌ బోర్డుల్లో సభ్యురాలిగా ఉంది. ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో ఎంబీయే చేస్తోంది. జూన్‌ నాటికి ఆమె చదువు పూర్తవుతుంది. కాగా.. ఆనంద్‌ ఈషాకు ప్రపోజ్‌ చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కవలల్లో ఆకాశ్‌ కంటే ఈశానే పెద్దది. కొన్ని సెకన్ల ముందు ఆమె జన్మించిందట. అందువల్ల ఈశా వివాహం ముందు జరిపిస్తారనే వార్తలూ వినిపిస్తున్నాయి. అయితే కుటుంబవర్గాలు మాత్రం ఏ విషయాన్ని వెల్లడించలేదు. ఆకాశ్‌-శ్లోక, ఈశా-ఆనంద్‌ వివాహ తేదీలను అధికారికంగా ప్రకటిస్తేనే విషయం తెలుస్తుంది. మహాబలేశ్వర్‌లోని ఓ ఆలయంలో ఆనంద్‌ తొలుత ఈశాతో పెళ్లి ప్రస్తావన తెచ్చారు. ఇందుకు ఈశా అంగీకరించారట. అనంతరం రెండు కుటుంబాల వారూ కలిసి విందు చేసుకున్నారు. ఆనంద్‌ తల్లిదండ్రులు స్వాతి, అజయ్‌ పిరమాల్‌, సోదరి నందిని, ఈశా తల్లిదండ్రులు నీతా, ముకేశ్‌ అంబానీ, నానమ్మ కోకిలాబెన్‌, అమ్మమ్మ పూర్ణిమా దలాల్‌, ఈశా కవల సోదరుడు ఆకాశ్‌ అంబానీ, తమ్ముడు అనంత్‌ అంబానీ తదితరులంతా ఎంతో ఆనందంగా ఈ విందుకార్యక్రమాన్ని నిర్వహించుకున్నారని తెలిసింది.