ఒకే ఇంట్లో వందకుపైగా నాగుపాములు..
Spread the love

ఒడిశాలోని భద్రక్ జిల్లాకు చెందిన ఓ కూలీ ఇంట్లో వందకు పైగా నాగుపాములు కనిపించడం సంచలనం సృష్టించింది. శ్యామ్‌పూర్ గ్రామానికి చెందిన బిజయ్ భూయన్ అనే ఆ వ్యక్తి తాను పొదుపు చేసుకున్న మొత్తంతో ఈ మధ్య చిన్న ఇల్లు కట్టుకున్నాడు. శుక్రవారం సడెన్‌గా ఓ మూల నుంచి చిన్న పాము పిల్ల బిజయ్ కూతురు వైపు వచ్చింది. అది చూసి ఆమె భయంతో పరుగులు తీసింది. ఆ తర్వాత బిజయ్ తన గదిలోకి వెళ్లి జాగ్రత్తగా పరిశీలించగా ఓ మూలకు ఉన్న పుట్టలో పదుల సంఖ్యలో పాములు కనిపించడంతో షాక్ తిన్నాడు.

వెంటనే స్థానిక స్నేక్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయగా వాళ్లు ఎంతో శ్రమించి ఈ పాము పిల్లలన్నింటినీ ఇంటి నుంచి బయటకు తీసుకురాగలిగారు. పుట్టను మొత్తం తవ్వగా అందులో వందకు పైగా కోబ్రా పిల్లలతోపాటు 21 గుడ్లు కూడా కనిపించాయి. తల్లి పాము మాత్రం దొరకలేదని వాళ్లు చెప్పారు. ఆ పాములను చూసినప్పటి నుంచీ బిజయ్ ఆ ఇంట్లో ఉండాలంటే భయపడుతున్నాడు.

నిజానికి ఒడిషాలో వరదలు, తుఫాన్లులాంటి ప్రకృతి విపత్తుల కంటే ఎక్కువగా పాము కరవడం వల్ల చనిపోయే వారి సంఖ్యే ఎక్కువ అని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ బిష్ణుపాద సేథి తెలిపారు. పాము కాటు మరణాలను కూడా ఒడిషా ఓ ప్రత్యేక విపత్తుగా పరిగణించడం గమనార్హం. గత మూడేళ్లలో పాము కాటు ద్వారానే 1700 మంది చనిపోయారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.