నా జీవితంలో ఇంకా ఆ రెండిటికీ చోటు లేదేమో..!
Spread the love

కొన్నేళ్ల పాటు క్యాన్సర్‌తో పోరాడి బయటపడ్డారు నటి మనీశా కోయిరాలా. చాలా కాలం తర్వాత ఆమె ‘డియర్‌ మాయా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు ‘సంజు’ చిత్రంలో అలనాటి తార నర్గిస్‌ దత్‌ పాత్రను పోషించే అవకాశం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా తన సినిమాల గురించి, పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘2010లో నేపాల్‌కు చెందిన వ్యాపారవేత్త సమ్రాట్‌ దహల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ రెండేళ్లకే మేం విడిపోయాం. పెళ్లి విషయంలో తప్పు నాదే. తెలీక వేసిన తప్పటడుగు. బహుశా నా జీవితంలో ప్రేమ, పెళ్లికి చోటు లేదేమో. అయినా పర్వాలేదు..మరో తప్పుడు రిలేషన్‌షిప్‌లో ఉండటం కంటే నా జీవితంలో ప్రేమకు చోటు లేదు అన్న చేదు నిజాన్ని అంగీకరించడమే మంచిది. నా జీవితాన్ని వెనక్కి నెట్టే అవకాశం మరో వ్యక్తికి ఇవ్వను. దేవుడు నాకు రెండో అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ సమయంలో నా కెరీర్‌, వ్యక్తిగత జీవితాలకు సంబంధించి తప్పుడు నిర్ణయాలు తీసుకోదలచుకోలేదు. కానీ ఓ బిడ్డను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు కాదు. నేను సినిమాలతో బిజీగా ఉన్నాను. నా సమయాన్నంతా బిడ్డకే కేటాయించగలను అని నేను అనుకున్నప్పుడు దత్తత తీసుకుంటాను. వేరే పనులతో బిజీగా ఉన్నప్పుడు బిడ్డకు తల్లవడంలో అర్థంలేదు’ అని తెలిపారు.

అనంతరం ‘సంజు’ చిత్రంలో తన పాత్ర గురించి మాట్లాడుతూ..‘నర్గిస్‌ దత్‌ పాత్రలో లీనమై నటించాలని చాలా ప్రయత్నించాను. ఆమె పాత్రలో నటిస్తున్నాను కాబట్టి తనలాగే జుట్టు వేసుకుని, మేకప్‌ పూసుకుంటే సరిపోదు. ఆమె వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోగలగాలి. అదీకాకుండా నర్గిస్‌ కూడా నాలాగే క్యాన్సర్‌తో బాధపడ్డారు. కాబట్టి ఆమె అనుభవించిన బాధ నాకు తెలుసు. ఏ పాత్రనైనా రిహార్సల్స్‌ లేకుండా నటించగలిగే సామర్ధ్యం ఉంది. కానీ నర్గిస్ పాత్రను అలా చేయలేను. అందుకే సినిమా చిత్రీకరణకు ముందు ఆమె జీవితం గురించి ఎంతో పరిశోధన చేశాను. అందులో ఎంత వరకు విజయం సాధించానో సినిమా చూసి తెలుసుకోవాలి’ అని చెప్పుకొచ్చారు మనీశా.