గోవా,మణిపూర్,బీహార్‌లపై పడ్డ కర్ణాటక రాజకీయ ప్రభావం
Spread the love

కర్ణాటక రాజకీయ సంక్షోభం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కొన్ని నెలల కిందట ఎన్నికల అనంతరం అధికారం కోల్పోయిన రాష్ట్రాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి.కర్ణాటక గవర్నర్‌ వాజుభాయ్‌ వాలా నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్‌. బీజేపీ అవసరాల మేరకు అనుగుణంగా పని చేయటం సరికాదంటూ పలు పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్న రూల్‌ రాజ్యాంగంలోనే ఉందని బీజేపీ చెబుతుండగా… ఆ పాయింటే ఇప్పుడు బీజేపీని ఇరకాటంలో పడేసేలా కనిపిస్తోంది. అనూహ్యంగా గోవా, బిహార్‌,మణిపూర్ రాజకీయాలు తెరపైకి వచ్చాయి. ఆయా రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీలు తమవేనంటూ కాంగ్రెస్‌, ఆర్జేడీ లు తమకు అవకాశం ఇవ్వాలని వాదిస్తున్నాయి.

గోవా: గోవా రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ‘అతిపెద్ద పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి’ అన్న లాజిక్‌ లేవనెత్తుతూ కాంగ్రెస్‌ పార్టీ పోరాటానికి సిద్ధమైపోయింది. మొత్తం 16 మంది ఎమ్మెల్యేలతో రాజ్‌భవన్‌లో పేరేడ్‌కు సిద్ధమైపోయింది. హైకమాండ్‌ సూచనల మేరకు గురువారం మధ్యాహ్నం గోవా కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ భేటీ జరిగింది. అనంతరం సీఎల్పీ చంద్రకాంత్‌ కవ్లేకర్‌ మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌ మృదులా సిన్హాను కలిసి ఎమ్మెల్యేల సంతకంతోపాటు కూడిన లేఖను సమర్పించబోతున్నాం. అవసరమైతే ఎమ్మెల్యేలతో పేరేడ్‌ కూడా నిర్వహిస్తాం.

రూల్‌ ప్రకారం అతిపెద్ద పార్టీ మాదే.  కాబట్టి ప్రస్తుత ప్రభుత్వ రద్దు చేసి, మాకు అవకాశం ఇవ్వాలని కోరతాం. కర్ణాటక పరిణామాలను చూశాక గోవా గవర్నర్‌ గతంలో చేసిన పొరపాటును సరిదిద్దుకుంటారని భావిస్తున్నాం’ అని చంద్రకాంత్‌ వెల్లడించారు.  మొత్తం 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీకి గతేడాది ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ 17 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 21 మాత్రం రాలేదు. దీంతో 14 సీట్లు వచ్చిన బీజేపీ.. గోవా ఫార్వర్డ్‌ పార్టీ-ఎంజీపీ-స్వతంత్ర్య అభ్యర్థుల(మొత్తం 9సీట్లు) సాయంతో కూటమిగా గోవాలో మారి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది.

పాట్నా: ఆర్జేడీ నేత, బిహార్‌ మాజీ మంత్రి తేజస్వి యాదవ్‌ బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించినట్లు బీజేపీ చెబుతోంది. ఆ లెక్కన్న బిహార్‌లో ఆర్జేడీనే అతిపెద్ద ప్రభుత్వం. మరి నితీశ్‌ కుమార్‌ సర్కార్‌ను రద్దు చేసి మమల్ని బిహార్‌ గవర్నర్‌ ఆహ్వానిస్తారా?’ అని తేజస్వి సెటైరిక్‌గా ఓ ట్వీట్‌ చేశారు. ఇక కర్ణాటక రాజకీయాలకు నిరసనగా ఆర్జేడీ గురువారం ఒక్కరోజు నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ‘దేశం మొత్తం బీజేపీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోంది. విభజన రాజకీయాలు, గవర్నర్లను తమ గుప్పిట్లో పెట్టుకుని అధికారం చెలాయిస్తోంది. ఆర్జేడీ ఎమ్మెల్యేలంతా గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరతాం. ఎందుకంటే మాదే పెద్ద పార్టీ కాబట్టి’ అని తేజస్వి మీడియాకు తెలిపారు.

2015లో ఆర్జేడీ-జేడీయూ కూటమి మహాఘట్భందన్‌ పేరిట ఎన్నికల్లో పాల్గొని 151 సీట్లు గెలుచుకున్నాయి. ఆర్జేడీకి 80 సీట్లు వచ్చి అతిపెద్దగా పార్టీగా ఆవిర్భవించగా.. జేడీయూ 71 సీట్లతో సరిపెట్టుకుంది. అయితే కొంత కాలం తర్వాత జేడీయూ  మహాఘట్భందన్‌ నుంచి బయటకు వచ్చి బీజేపీ(53 సీట్లు)తో దోస్తీ కట్టింది.

మణిపూర్ : గతేడాది మార్చిలో మణిపూర్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 60 స్థానాలకుగానూ కాంగ్రెస్‌ 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, 21 సీట్లు సాధించిన బీజేపీ అధికారం సొంతం చేసుకుంది. నలుగురేసి ఎమ్మెల్యేలున్న నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ), నాగా పీపుల్స్‌ ఫ్రంట్ ‌(ఎన్‌పీఎఫ్‌)తో పాటు ఒక లోక్‌ జనశక్తి ఎమ్మెల్యే, ఒక తృణమూల్‌ ఎమ్మెల్యే, ఒక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మద్దతుతో బీజేపీ బలం 32కి పెరిగింది. బీజేపీ నేత నాంగ్‌తోంబం బీరేన్‌ సింగ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గత ఎన్నికల్లో మేఘాలయలో కాంగ్రెస్‌ 21 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచినా.. రెండే సీట్లు గెలిచిన బీజేపీ ఇతరుల మద్దతు కూడగట్టి ఎన్‌పీపీ అధికారంలోకి వచ్చింది.