కొండంత బలాన్ని ఇచ్చిన అభిమానులకు ధన్యవాదాలు: ఎన్టీఆర్
Spread the love

అరవింద సమేత చిత్ర యూనిట్ లో సక్సెస్ సెలెబ్రేషన్స్ మొదలయ్యాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందిన ‘అరవింద సమేత’ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచి చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ తన నటనతో అదరగొట్టాడు. దసరా సెలవులు ఉండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ‘అరవింద సమేత’ చిత్రం ఘన విజయం ఖాయం అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అరవింద సమేత విజయంపై ఎన్టీఆర్ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. అరవింద సమేత చిత్రానికి వస్తున్న అద్భుతమైన స్పందన సంతోషాన్ని కలిగిస్తోంది. మీ ప్రేమకు కృతజ్ఞతలు. త్రివిక్రమ్ శ్రీనివాస్ లేకుండా ఇంత భారీ విజయం సాధ్యం కాదు. ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ అంకిత భావంతో పనిచేశారు. మమ్మల్ని నడిపించింది ఆయనే అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేసాడు. ఆ తరువాత అభిమానులందరికి కృతజ్ఞతలు తెలియజేసిన ఎన్టీఆర్…. ఇలాంటి సమయంలో నాకు  కొండంత బలాన్నిచ్చింది మీరే అంటూ తన తండ్రి మరణ విషాదాన్ని పరోక్షంగా ప్రస్తావించాడు. అదేవిధంగా, చిత్రయూనిట్ కు, మీడియాకు కూడా కృతజ్ఞతలు తెలియజేశాడు.