ఎన్టీఆర్ పేరు చెడగొట్టే పని మాత్రం చేయను… కేటీఆర్
Spread the love

“మా తాత ఎన్టీఆర్, మా నాన్న చంద్రబాబులా పేరు తెచ్చుకుంటానో లేదో కానీ… వాళ్ల పేరు మాత్రం చెడగొట్టను”. ఇదీ తనపై ఆరోపణలొచ్చినప్పుడల్లా నారా లోకేష్ చెప్పే మాట. కొంచెం అటూ..ఇటుగా ఇలాంటి మాటనే చెప్పారు. . తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. తారకరామారావు పేరు నిలబెట్టే పని చేస్తా కానీ చెడగొట్టే పని చేయనన్నారు. బాలకృష్ణ చైర్మన్ గా వ్యవహరిస్తున్న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో… బీఎంటీ యూనిట్‌ ప్రారంభోత్సవంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మొదటగా ఈ కార్యక్రమంలో మాట్లాడిన బాలకృష్ణ కూడా.. నాన్న స్ఫూర్తితోనే కేసీఆర్ తన కుమారుడికి తారకరామారావు పేరు పెట్టారని చెప్పారు. దానికి తగ్గట్లుగా కేటీఆర్ తన ప్రసంగంలో పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు.

ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం పరిణామాల్లో కేటీఆర్ పేరు చాలా సార్లు హాట్ టాపిక్ అయింది. ఎన్టీఆర్ సంబంధించిన జ్ఞాపకాలను.. హైదరాబాద్ లో తుడిచేసే ప్రయత్నాలను కేసీఆర్ చేశారని గతంలో టీడీపీ నేతలు ఆరోపించారు. కుమారుడికి ఎన్టీఆర్ పేరు పెట్టుకుని.. ఆ మహానుభావుడిపైనే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు.. ఎన్టీఆర్ కు సంబంధించిన విషయాల్లో వివాదాలొస్తే ముందు కేటీఆర్ పేరును గుర్తు చేసి విమర్శలు చేసేవారు. కేటీఆర్ అసలు పేరు తారక రామారావు కాదని అజయ్ అని… అప్పట్లో ఎన్టీఆర్ దృష్టిలో పడేందుకు..టిక్కెట్ పొందేందుకు..తారక రామారావు అని మార్చారని.. రేవంత్ విమర్శలు చేసేవారు.

జూబ్లీహిల్స్‌లోని బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రిలో బీఎంటీ యూనిట్‌ను గురువారం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఛైర్మన్‌, మేనేజ్‌మెంట్‌ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. తొలుత 40 బెడ్స్‌తో ప్రారంభించిన ఈ ఆస్పత్రిని అంచలంచలుగా విస్తరిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు బాలయ్య వివరించారు. జీహెచ్‌ఎంసీకి ఆస్పత్రి చెల్లించాల్సిన రూ.6 కోట్లు ఆస్తి పన్నును రద్దు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.ఈసందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. క్యాన్సర్‌పై రాష్ట్ర ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ, ప్రవేటు సంస్థలు కలిసి పని చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే వైద్యులు, సెలబ్రెటీలు ఇందులో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. క్యాన్సర్‌ అని తెలియగానే…ఆ భయంతోనే సగం ప్రాణం పోతుందని..ఆ భయాన్ని పోగొట్టేందుకు ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉందని మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. కేటీఆర్‌ నందమూరి బాలకృష్ణ తను ఎంతగానో ఇష్టపడే నటుడని అన్నారు. తారకరామారావు అని ఆయన తండ్రి పేరున్న తాను ఆ పేరు నిలబెట్టే పని చేస్తాను కానీ, చెడగొట్టే పని మాత్రం చేయనని అన్నారు.