ఇంగ్లాండ్ కు వణుకు పుట్టించిన చైనామన్‌.. హిట్‌మ్యాన్‌
Spread the love

ఇంగ్లాండ్ గడ్డ పై వన్డే సిరీస్ లో టీమ్ఇండియాకు అద్భుత ఆరంభం. భారత్ లోనే స్పిన్నర్లు ప్రభావం చూపుతారనే అపప్రథను తొలిగిస్తూ..చైనామన్ చిచ్చరపిడుగు కుల్దీప్ యాదవ్ (6/25) వికెట్ల సిక్సర్ కొట్టాడు. బంతిని బొంగరంలా గింగిరాలు తిప్పుతూ నాటింగ్ హోమ్ లో నాట్యం చేయించాడు. మరోవైపు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (137 నాటౌట్; 114 బంతుల్లో 15×4, 4×6) మెరుపు సెంచరీ సాధించాడు . ఫలితం.. ఇంగ్లాండ్ తొలి వన్డేలో భారత్ దుమ్ము రేపింది… ఆల్ రౌండ్  ప్రదర్శనతో ఇంగ్లిష్ జట్టును 8 వికెట్ల తేడాతో ఓడించి మూడు వన్డేల సిరీస్ ను 1-0 తో బోణీ కొట్టింది. ఇక టీమ్ఇండియా నంబర్ వన్ ర్యాంక్ వైపు దిగ్విజయంగా తొలి అడుగు వేస్తుంది.

ఇక బౌలింగ్ లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, బ్యాటింగ్ లో  రోహిత్, కోహ్లి సత్తా చాటడంతో తొలి వన్డేలో టీమ్ఇండియాకు ఎదురేలేకపోయింది. గురువారం జరిగిన మ్యాచ్ లో  మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. కుల్దీప్ ధాటికి 49.5 ఓవర్లలో 268 పరుగులకే ఆలౌటైంది. బట్లర్ (53) టాప్ స్కోరర్. రోహిత్ సెంచరీతో చెలరేగడంతో లక్ష్యాన్ని భారత్ 40.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

కుల్దీప్ మాయాజాలం..

ఇది భారత స్పిన్నర్ కుల్దీప్ బౌలింగ్ ప్రదర్శన. అతడు వేసిన 60 బంతుల్లో 38 డాట్ బాల్సే. ఒక్కటంటే ఒక్కటి కూడా బౌండరీ లైన్ ను  దాటలేదు. అంతలా రెచ్చిపోయాడు ఈ చైనామన్ బౌలర్.  మొదట టాప్ ఆర్డరుని , ఆ తర్వాత మిడిలార్డర్ ను … ఇలా క్రీజులో ఎవరు వచ్చినా విడిచిపెట్టలేదు. 300 పైచిలుకు స్కోరు ఖాయమనుకున్న జట్టును 268 పరుగులకే కట్టడి చేశాడు. టాస్ నెగ్గిన కోహ్లి ఫీల్డింగ్ కె  మొగ్గుచూపాడు. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను  ఆరంభించిన జేసన్ రాయ్ (35 బంతుల్లో 38; 6 ఫోర్లు), బెయిర్స్టో (35 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్కు 73 పరుగులు జోడించారు. పేసర్లు ఉమేశ్, సిద్ధార్థ్ కౌల్లను చితకబాదిన ఓపెనర్లు కుల్దీప్ బౌలింగ్ కు  దిగగానే మోకరిల్లారు. తొలి ఓవర్లోనే రాయ్ ని , రెండో ఓవర్లో జో రూట్ (3), బెయిర్స్టోలను ఔట్ చేశాడు. దీంతో జట్టు స్కోరు వంద దాటినప్పటికీ 4 కీలక వికెట్లను కోల్పోయింది. ఈ దశలో బట్లర్, బెన్స్టోక్స్ జట్టును ఆదుకున్నారు. ఐదో వికెట్ కు  93 పరుగులు జతచేశారు. ఆ తర్వాత మళ్లీ కుల్దీప్ మాయ మొదలైంది. వీరిద్దరితో పాటు విల్లీ (1)ని ఔట్ చేశాడు. చివర్లో మొయిన్ అలీ (24), ఆదిల్ రషీద్ (22) ఓ మోస్తరుగా రాణించడంతో ఇంగ్లండ్ 250 పరుగుల మార్కును దాటింది.

రోహిత్‌ జోరు..

లక్ష్యం మరీ భారీగా లేకపోవడంతో ఆరంభం నుంచే రోహిత్, శిఖర్ ధావన్ (40; 27 బంతుల్లో 8×4) స్వేచ్ఛగా ఆడారు. ముఖ్యంగా శిఖర్ ఆఫ్ సైడ్  మెరుపు షాట్లు కొట్టాడు. తొలి వికెట్ కు  వేగంగా 59 పరుగులు జోడించిన తర్వాత ధావన్ ఔటయ్యాడు. అక్కడ నుంచి ఇంగ్లాండ్ కు  ఆనందించడానికి ఏమీ లేకపోయింది. అప్పటి వరకు కాస్త నెమ్మదిగా ఆడిన రోహిత్.. టాప్ గేర్ లోకి  వచ్చి ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. 54 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన అతను.. అదే ఊపులో సెంచరీకి చేరువయ్యాడు. రషీద్ బౌలింగ్ లో  కళ్లుచెదిరే సిక్సర్ లతో  అతను 82 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అతనికిది 18వ సెంచరీ. మరోవైపు కోహ్లి కూడా ధాటిగా ఆడడంతో భారత్ ఛేదన దిశగా దూసుకుపోయింది. 55 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన విరాట్.. ముచ్చటైన షాట్లు కొట్టాడు. అతను రషీద్ బౌలింగ్ లో స్టంప్ అవుట్ అయ్యాడు . రోహిత్-కోహ్లి రెండో వికెట్ కి 167 పరుగులు జోడించారు. కోహ్లి ఔటైనా.. రోహిత్, రాహుల్ తో (9 నాటౌట్) కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.