టీమ్‌ఇండియా ఇంగ్లిష్‌ పరీక్షకు సిద్ధమైంది..!
Spread the love

విదేశాల్లో రికార్డు అంతంత మాత్రం. 57 టెస్టులు ఆడితే గెలిచింది ఆరే. ఉపఖండం ఆవల గత ఐదేళ్లలో గెలిచింది ఒకే ఒక్క సిరీస్‌. అది బలహీన  వెస్టిండీస్‌పై. చరిత్రేమీ ప్రోత్సాహకరంగా లేని ఈ పరిస్థితుల్లో టీమ్‌ ఇండియా ఇంగ్లిష్‌ పరీక్షకు సిద్ధమైంది. నేటి నుంచే ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు. ర్యాంకుల్లో నంబర్‌వన్‌గా ఉన్న భారత్‌.. ఆటలో ఆ స్థాయి చూపించాల్సిన అవసరం ఉంది. గాయాలతో కీలక బౌలర్లు దూరం కావడం పరీక్షను మరింత కఠినతరం చేస్తున్నా తొలి టెస్టు ఫలితం సిరీస్‌కే అత్యంత కీలకమైన నేపథ్యంలో భారత జట్టు శుభారంభం చేయాలనే పట్టుదలతో ఉంది. సారథిగా కోహ్లికిది అత్యంత కఠినమైన సిరీస్‌ అనడంలో సందేహం లేదు. భారత జట్టుకిది పరీక్షా సమయం. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు బుధవారం ఆరంభం కానుంది. తన 1000వ టెస్టులో విజయంతో సంబరాలు చేసుకోవాలని ఇంగ్లాండ్‌ భావిస్తుంటే.. భారత్‌ విజయంతో సిరీస్‌లో ఘనంగా బోణీ కొట్టాలనుకుంటోంది.

2014లో ఇక్కడ ఆఖరి టెస్టు ఆడిన భారత తుది జట్టు నుంచి కనీసం ఆరుగురు ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో కూడా ఆడబోతున్నారు. విజయ్, పుజారా, రహానే, అశ్విన్, ఇషాంత్‌లతో పాటు విరాట్‌ కోహ్లి ఈ జాబితాలో ఉన్నాడు. అయితే ఎవరు ఎలా ఆడినా కోహ్లిని మాత్రం నాటి సిరీస్‌ జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ సారి కచ్చితంగా బాగా ఆడాల్సిన స్థితిలో అతను బరిలోకి దిగుతుండగా, కెప్టెన్‌గా జట్టును గెలిపించాల్సిన బాధ్యత కూడా అతనిపై ఉంది. వరల్డ్‌ టాప్‌ బ్యాట్స్‌మన్‌గా కోహ్లి తన స్థాయిని ప్రదర్శిస్తే భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించడం ఖాయం. ఇద్దరు ఓపెనర్లలో విజయ్‌తో పాటు ఎడమచేతి వాటం కావడం వల్ల శిఖర్‌ ధావన్‌ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. అయితే తాజా ఫామ్‌ మాత్రం రాహుల్‌ మెరుగనే చూపిస్తోంది. పుజారా మాత్రం తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకోలేకపోతున్నాడు. 2014లో అందరిలాగే విఫలమైన తాను, ఇటీవల కౌంటీ క్రికెట్‌ ఆడినా పెద్దగా ప్రభావం చూపలేదు. అనూహ్య నిర్ణయాలు తీసుకునే కోహ్లి అవసరమైతే పుజారాను కూడా పక్కన పెట్టి మూడో స్థానంలో రాహుల్‌ను ఆడించవచ్చు కూడా. ఇక రహానే కూడా తన సామర్థ్యానికి తగిన విధంగా రాణించాల్సి ఉంది. బౌలింగ్‌లో ఇద్దరు పేసర్లు ఇషాంత్, ఉమేశ్‌ ఉండటం ఖాయం. భువనేశ్వర్, బుమ్రా లేని లోటు కనిపించకుండా వీరిద్దరు సత్తా చాటాల్సి ఉంది. స్పిన్నర్లలో అశ్విన్‌ తను అనుభవాన్ని చూపిస్తే ఇంగ్లండ్‌కు ఇబ్బందులు తప్పవు. పాండ్యాను మూడో సీమర్‌గా భావిస్తే కుల్దీప్‌కు అవకాశం దక్కవచ్చు. అయితే ఇప్పటి వరకు డ్యూక్‌ బంతులతో బౌలింగ్‌ చేయని కుల్దీప్‌ ఏమాత్రం ప్రభావం చూపిస్తాడనేది ఆసక్తికరం.

భారత్‌ vs ఇంగ్లండ్‌: తొలి టెస్టు మధ్యాహ్నం గం. 3.30 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్‌–3లో ప్రత్యక్ష ప్రసారం….