నా రిలేషన్‌షిప్ గురించి చెప్పాల్సిందంతా చెప్పేశా!
Spread the love

టాలీవుడ్ మాస్ మ‌హారాజా రవితేజ, ఇలియానా జంటగా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై శ్రీనువైట్ల దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మిస్తోన్న చిత్రం “అమర్‌ అక్బర్‌ ఆంటొని”. ఈ చిత్రం నవంబర్‌ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. విడుదల దగ్గరపడడంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ ఇలియానా మీడియాతో చెప్పిన సంగతులు… ‘‘నా వ్యక్తిగత జీవితం, ఆండ్రూ నీబోన్‌తో నా రిలేషన్‌షిప్ గురించి నేను చెప్పాల్సిందంతా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టుల్లో చెప్పేశా! వ్యక్తిగత జీవితంలో నేను హ్యాపీగా ఉన్నాను… అంతే! అంతకు మించి నేను మాట్లాడను’’ అన్నారు.

ఇక తెలుగులో ఆరేళ్ల తర్వాత సినిమా చేయడం సంతోషంగా ఉంది. ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ కథ నచ్చింది. అలాగే, గ్లామర్‌గా కనిపిస్తూ… నటనకు ఆస్కారమున్న పాత్ర! వీటికి తోడు రవితేజ నా ఫేవరేట్‌ హీరో. దాంతో వెంటనే ఒప్పేసుకున్నా! అని చెప్పింది. ఈ సందర్బంగా ఇలియానా మీటూపై స్పందిస్తూ, ‘స్త్రీ కావచ్చు.. పురుషుడు కావచ్చు. ఎవరైనా లైంగిక వేధింపులను అనుభవించిన వ్యక్తి ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పడం చాలా మంచి విషయం. ఇది ఒక భయానిక అనుభవం. ఎవరో ఒకరు ముందుకు వస్తేనే ఇలాంటి సమస్యలు తీరుతాయి. లేదంటే ఇటువంటి పరిస్థితులు అన్ని చోట్లా ఉదృతం అవుతాయి. ఇలాంటి సమస్యపై నేను స్పందించాల్సిన సమయంలో ఖచ్చితంగా స్పందిస్తాను’ అని చెప్పుకొచ్చింది.