
ఏఆర్ రెహమాన్… ఈ పేరు తెలియని సంగీత అభిమాని ఉండరు. ఆస్కార్ అవార్డు సైతం సొంతం చేసుకుని కేవలం భారత దేశానికే పరిమితం కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో పాపులర్ అవ్వడంతో పాటు అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఏఆర్ రెహమాన్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులుండొచ్చు. కానీ ఓ దశలో ఆయన జీవితం చాలా దుర్భరంగా గడిచిందట. తన తొమ్మిదేళ్ల వయసులో సంగీత కళాకారుడిగా పనిచేసే తండ్రి దూరం కావడంతో కుంగుబాటుకు గురయ్యారట. దిలీప్ కుమార్ అనే తన అసలు పేరుతో సహా జీవితంలో ఏదీ నచ్చేది కాదట. ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నారట. అలాంటి స్థితి నుంచి మొదలై ఈరోజు సుప్రసిద్ధ సంగీత దర్శకుడిగా, ఆస్కార్ విజేతగా ఎదిగిన రెహమాన్ జీవితంలో ఎన్నో ఆసక్తికర సంఘటనలున్నాయి.
వాటిని కృష్ణ త్రిలోక్ అనే రచయితతో కలసి పుస్తక రూపంలో ఆవిష్కరించారు. ‘నోట్స్ ఆఫ్ ఎ డ్రీమ్: ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ ఏఆర్ రెహమాన్’ పేరుతో ఇటీవలే విడుదలైన ఆ పుస్తకంలో రెహమాన్ తన ప్రస్థానం గురించి అభిమానులతో పంచుకున్నారు. ‘‘12 నుంచి 22 ఏళ్ల మధ్యలోనే నాకు జీవితమంతా చూసేసినట్లు అనిపించేది. సాధారణ విషయాలపై అసలు ఆసక్తి ఉండేది కాదు. మా నాన్న దూరమైనప్పట్నుంచీ జీవితం శూన్యంగా అనిపించేది. 25 ఏళ్ల వయసు వరకూ నాకు ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవి. నా జీవితంలో జరిగిన పరిణామాలు నన్ను కుంగుబాటుకు గురిచేశాయి. అయితే ఓ విధంగా అవే నాలో భయాన్ని పోగొట్టాయి.
ఈ లోకంలో ప్రతి ఒక్కరికీ మరణం ఉంది. అలాంటప్పుడు దేనికైనా ఎందుకు భయపడాలి అనిపించింది. నా గతాన్ని వదిలేసి ఓ కొత్త మనిషిగా మారాలనుకున్నాను. ఎందుకో నా అసలు పేరు నాకు నచ్చేది కాదు. నా వ్యక్తిత్వానికి అది సరిపోదనిపించింద’’ని చెప్పారు. తన తొలి చిత్రం ‘రోజా’కు ముందు ఇస్లాం మతాన్ని స్వీకరించి రెహమాన్‌గా పేరుమార్చుకున్నారాయన. అందుకే నేను ఎక్కువగా రాత్రిపూట, తెల్లవారుజామున ప్రశాంత వాతావరణంలో పనిచేస్తుంటాను. ప్రయాణాలు చేయడం, కుటుంబంతో గడపడం ద్వారా నా పనిఒత్తిడి నుంచి బయటపడతాను’’ అని రెహమాన్ పేర్కొన్నారు.