హ్యుందాయ్‌ @ విద్యుత్తు కార్లు
Spread the love

 

దక్షిణకొరియాకు చెందిన కార్ల ఉత్పత్తి సంస్థ హ్యుందాయ్‌ విద్యుత్తు కార్ల ఉత్పత్తి ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దక్షిణకొరియాకు చెందిన ఈ సంస్థ చెన్నై ప్లాంటులో తయారు చేసిన కార్లను, కొన్ని దేశాలకు ఎగుమతి చేస్తోంది కూడా. గత 20 సంవత్సరాలలో దేశీయంగా 80 లక్షల వాహనాలు విక్రయించిన హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌), 2021 నాటికి కోటి కార్ల అమ్మకం లక్ష్యాన్ని నిర్దేశించుకుందని హెచ్‌ఎంఐఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) వై.కె.కూ తెలిపారు. 2020 లోపు మరో 8 కొత్త మోడళ్లు ఆవిష్కరిస్తామని వెల్లడించారు. ఇందులో 2 సరికొత్త విభాగాలు, 5 మోడళ్ల మార్పులు, ఒకటి విద్యుత్తు స్పోర్ట్స్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) ఉంటుందని తెలిపారు. విద్యుత్తు ఎస్‌యూవీని 2019 ద్వితీయార్థంలో విడుదల చేస్తామని పేర్కొన్నారు. తొలుత విడిభాగాలన్నీ పూర్తిగా దిగుమతి చేసుకుని, ఇక్కడ బిగింప చేస్తామన్నారు. మార్కెట్‌ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా, దీర్ఘకాల దృక్పథంతో చెన్నై ప్లాంటులో విద్యుత్తు వాహనాలు ఉత్పత్తి చేయాలన్నది తమ ప్రణాళికగా పేర్కొన్నారు. విద్యుత్తు వాహనాలు అత్యధికులకు చేరువ కావాలంటే, ప్రభుత్వ సహకారం తప్పనిసరి అని తెలిపారు. వీటికి దిగుమతి సుంకాలు తగ్గించాలని, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రేటును 12 శాతం నుంచి 5 శాతానికి కుదించాలని, వ్యక్తిగత వాహనాల కొనుగోలుకు సాయం అందించాలని సూచించారు. పెట్రోల్‌ బంకుల తరహాలో, వాహనాల బ్యాటరీల ఛార్జింగ్‌కు కేంద్రాలను విరివిగా స్థాపించాల్సి వస్తుందని, ఇందుకు ప్రభుత్వ సహకారం తప్పనిసరి అని గుర్తు చేశారు. దేశంలోకి హైబ్రిడ్‌ వాహనాలు తీసుకు రావాలన్న యోచన లేదన్నారు. ప్రస్తుతం చెన్నై ప్లాంట్‌ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 7 లక్షల వాహనాలు కాగా, 2019 జనవరి నుంచి దీన్ని 7.5 లక్షల వాహనాలకు పెంచనున్నట్లు వివరించారు. ఈ ఏడాది దీపావళిలోపు కుటుంబానికి సరిపోయే హ్యాచ్‌బ్యాక్‌ (డిక్కీ లేని) కారు విడుదల చేస్తామన్నారు.