భార్య ఏటీఎం కార్డు భర్త ఉపయోగించకూడదు
Spread the love

ఇదో వింత కేసు. ఇలాంటి కేసు ఇప్పటివరకు మీరు చూసి ఉండరు. ఓ భార్య తాను బాలింతగా ఉన్నదని తన ఏటీఎం కార్డును భర్తకు ఇచ్చి డబ్బు తెమ్మని చెప్పడం వాళ్ల కొంప ముంచింది. రూ.25 వేలు నష్టం రావడంతోపాటు ఐదేళ్లు బ్యాంకు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. ఈ స్టోరీ మొత్తం చూసిన తర్వాత మీ ఏటీఎం కార్డు మరొకరికి ఇచ్చే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి.

అది నవంబర్ 14, 2013. బెంగళూరులోని మరతహళ్లికి చెందిన వందన అనే మహిళ తన డెబిట్ కార్డును భర్త రాజేష్‌కుమార్‌కు ఇచ్చి రూ.25 వేలు తెమ్మని చెప్పింది. అతడు ఓ మెషీన్‌లో నుంచి డబ్బు తీయడానికి ప్రయత్నించగా.. అకౌంట్‌లో నుంచి డబ్బు డెబిట్ అయింది కానీ.. మెషీన్ నుంచి క్యాష్ మాత్రం బయటకు రాలేదు. కాల్‌సెంటర్‌కు కాల్ చేస్తే ఏటీఎం మెషీన్ సమస్య అని, 24 గంటల్లో డబ్బు అకౌంట్‌లోకి వచ్చేస్తుందని చెప్పారు. కానీ రాలేదు. బ్యాంక్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కానీ కొన్ని రోజులకే వాళ్లు ఫిర్యాదును మూసేశారు. వాళ్లు చెప్పిన కారణం విని ఈ దంపతులకు షాక్ తగిలింది.

ఖాతాదారు ఏటీఎం దగ్గర లేరని, డబ్బు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. దీంతో వందన 2014, అక్టోబర్ 21న బెంగళూరులోని వినియోగదారుల ఫోరమ్‌ని ఆశ్రయించింది. తనకు అప్పుడే డెలివరీ అవడం వల్ల ఏటీఎంకు వెళ్లలేకపోయానని, తన భర్త వెళ్లినందుకు సదరు బ్యాంక్ వాళ్లు డబ్బు ఇవ్వడం కుదరదని చెబుతున్నారని ఫిర్యాదు చేసింది. ఏటీఎం సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా సంపాదించి ఫోరమ్ ముందు ఉంచారు. దీని ద్వారా డబ్బు రాలేదన్న విషయం వెల్లడైంది.

బ్యాంకు ఫోరమ్‌కు కూడా అదే సమాధానమిచ్చింది. కార్డ్ ఎవరి పేరు మీద ఉన్నదో ఆ వ్యక్తి అక్కడ లేదని స్పష్టంచేసింది. అయినా వందన, ఆమె భర్త రాజేష్ మాత్రం తమ డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కేసు మూడున్నరేళ్లు నడిచింది. అయితే ఏటీఎం పిన్‌ను మరొకరితో పంచుకోవడం బ్యాంకు నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని, అలాంటప్పుడు డబ్బు ఎలా ఇస్తామని బ్యాంకు వాదించింది. చివరికి కోర్టు కూడా 2018, మే 29న బ్యాంకుకు అనుకూలంగా తీర్పు చెప్పింది. వందన తన భర్తకు ఏటీఎం కార్డు బదులు చెక్ లేదా తన భర్త ఏటీఎంలో డబ్బు డ్రా చేయడానికి అనుమతిస్తూ లేఖ ఇవ్వాల్సిందని చెప్పి కోర్టు కేసు కొట్టేసింది. దీంతో డబ్బుతోపాటు ఈ దంపతుల విలువైన కాలం కూడా వృథా అయింది.

Leave a Reply