రేవంత్‌రెడ్డి అరెస్టుపై డీజీపీ మీద హైకోర్టు ఆగ్రహం!
Spread the love

రేవంత్‌రెడ్డి అరెస్టుకు సంబంధించి పోలీసుల వ్యవహార శైలిని ఉమ్మడి హైకోర్టు మరోసారి తప్పుబట్టింది. ఆయన అరెస్టుపై సమర్పించిన పత్రాలు ఇప్పటికిప్పుడు సృష్టించినట్లున్నాయని వ్యాఖ్యానించింది. ఎస్పీ ఆదేశాలకు డీజీపీ ఆమోదం ఎక్కడని నిలదీసింది. పోలీసులది అధికార దుర్వినియోగమేనని వ్యాఖ్యానించింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇలా నిర్బంధానికి దిగడమేనా? అని ప్రశ్నించింది. రేవంత్‌రెడ్డి వల్ల శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందనుకుంటే హెచ్చరించాలి, లేదంటే గృహ నిర్బంధంలో ఉంచవచ్చు. అంతేగానీ ఇలా నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేస్తారా? అసలు అరెస్టు చేయాలని ఆదేశించిన అధికారి ఎవరో తెలియాలని స్పష్టంచేసింది.

తెరాస ఫిర్యాదుపై ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాల్లోనూ సంతకం లేకపోవడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించింది. సీఈఓ సంతకం లేకుండా గుమస్తా పంపే లేఖలపై ఇంత తీవ్ర చర్యలు తీసుకుంటారా? అని నిలదీసింది. రేవంత్‌రెడ్డి నిర్బంధానికి నిఘా వర్గాలు ఇచ్చిన నివేదికలు, వికారాబాద్‌ ఎస్పీ, జిల్లా ఎన్నికల అధికారుల మధ్య వ్యవహారాలకు సంబంధించిన పత్రాల్లో కనీసం తేదీ, ప్రభుత్వ ముద్ర, సంతకాలు లేకపోవడం పట్ల న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తంచేసింది. అక్రమ నిర్బంధానికి సంబంధించి కారణాలు, బాధ్యులు తేలాల్సిందేనని స్పష్టం చేసింది. ఈనెల 12, 13 తేదీల్లోపు కౌంటరు అందజేయాలని చెబుతూ హైకోర్టు విచారణను 17వ తేదీకి వాయిదా వేసింది.