ఇకపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్లు ఉండవ్..!
Spread the love

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ప్రముఖ ఈ-కామర్స్‌ కంపెనీలకు గట్టి షాక్‌ తగిలింది. దాంతో సంస్థల భారీ డిస్కౌంట్‌ ఆఫర్లకు ఇక తెరపడేటట్లుంది. దేశంలోని ఈ-కామర్స్‌ కంపెనీల ఉత్పత్తుల విక్రయ నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ-కామర్స్‌ పోర్టళ్లు తమకు వాటాలున్న కంపెనీల ఉత్పత్తులను విక్రయించకుండా నిషేధం విధించింది. ఏదైనా ఉత్పత్తిని ప్రత్యేకంగా తమ ప్లాట్‌ఫామ్‌ ద్వారానే విక్రయించేలా ఈ-కామర్స్‌ సైట్లు కుదుర్చుకునే ఎక్స్‌క్లూజివ్‌ ఒప్పందాలనూ నిషేధించింది. ‘‘ఇకపై ఈ- కామర్స్‌ పోర్టళ్లు తమకు లేదా తమ గ్రూపు వ్యాపారాలకు ఈక్విటీ వాటాలున్న కంపెనీలు, సరుకు నిల్వలపై నియంత్రణ కలిగిన కంపెనీలకు చెందిన ఉత్పత్తులను తమ ప్లాట్‌ఫామ్‌ ద్వారా విక్రయించేందుకు అనుమతి ఉండదు’’ అని బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ-కామర్స్‌ సంస్థ కొనుగోలుదారులకు ఆఫర్‌ చేసే క్యాష్‌ బ్యాక్‌లు సముచితంగా, వివక్షారహితంగా ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇకపై ఈ-కామర్స్‌ కంపెనీలు గడిచిన ఆర్థిక సంవత్సరానికి గాను నిబంధనలకు లోబడి వ్యాపారం కొనసాగిస్తున్నట్లు తెలిపే సర్టిఫికేట్‌తో పాటు చట్టబద్ద ఆడిటర్‌ రిపోర్టును ఏటా సెప్టెంబరు 30కల్లా ఆర్‌బీఐకి సమర్పించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ-కామర్స్‌ కంపెనీలు అసాధారణ స్థాయిలో డిస్కౌంట్లు ఆఫర్‌ చేస్తున్నాయని, దాంతో తమ వ్యాపారాలకు తీవ్రనష్టం కలుగుతోందంటూ దేశంలోని అనేక వర్తక సంఘాలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. వీరి ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం తాజా చర్యలు చేపట్టింది.